ఆక్సిజన్ కొరత లేదు.. భయం వద్దు, జాగ్రత్తలు పాటించండి
ఇంట్లో ఉన్నా మాస్క్‌లు ధరించండి
అతిథులను ఆహ్వానించకండి
పాజిటివ్ వ్యక్తుల్ని వేరే గదుల్లో ఉంచండి
కంటైన్‌మెంట్ వ్యూహంతో కట్టడి చేద్దాం: కేంద్ర ప్రభుత్వం
మీడియాతో సమీక్షలో ఆరోగ్యశాఖ, హోంశాఖ ఉన్నతాధికారులు
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 సెకండ్‌వేవ్ ఉధృతి పట్ల ప్రజల్లో అనవసర భయాల్ని సృష్టించడం వల్ల మేలుకన్నా కీడే ఎక్కువని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు ఇళ్లల్లోనూ మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడంలాంటి కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. దేశంలో కొవిడ్ తీవ్రత, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై సోమవారం మీడియాతో కేంద్ర ప్రభుత్వ అధికారులు సమీక్షించారు. మీడియా సమావేశంలో ఆరోగ్యశాఖతోపాటు హోంశాఖ అధికారులు పాల్గొన్నారు. ‘ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించండి, ఇంట్లో ఒకరికి కొవిడ్19 పాజిటివ్ వస్తే ఆ వ్యక్తి తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే, ఇంట్లోని వారంతా మాస్క్ ధరించాలి, పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వేరే గదిలో ఉంచాలి’ అని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డా॥వికె పాల్ సూచించారు.
నిబంధనలు పాటించకపోతే వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికి అతిథుల్ని ఎవరినీ ఆహ్వానించకండి, అనవసరంగా బయట తిరగకండి అంటూ ఆయన సూచించారు. కొవిడ్ సోకిన వ్యక్తిని వేరే గదిలో ఉంచేందుకు ఇంట్లో సదుపాయం లేకపోతే సమీపంలోని ఐసోలేషన్ లేదా కరోనా కేర్ సెంటర్‌కు తరలించాలని పాల్ సూచించారు. తప్పనిసరైతేనే హాస్పిటల్‌లో చేర్చాలని కూడా ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌ను త్వరితంగా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వ్యాక్సినేషన్ విధానంలో కేంద్రం తీసుకువచ్చిన మార్పు వల్ల మరింత త్వరితంగా వ్యాక్సిన్ అందుతుందని తాము భావిస్తున్నామని ఆయన అన్నారు. మహిళలు బహిష్టు సమయాల్లోనూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. డాక్టర్ల సలహామేరకే పేషెంట్లు హాస్పిటల్‌లో చేరాలని ఆయన సూచించారు.
ఆక్సిజన్ కొరత లేదు:హోంశాఖ
దేశంలో మెడికల్ ఆక్సిజన్‌కు కొరత లేదని, నిల్వలు సరిపడినన్ని ఉన్నాయని, ఆస్పత్రులకు చేర్చే విషయంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయని హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూష్‌గోయల్ అన్నారు. ఆక్సిజన్‌ను తగినంతగా అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని ఆయన భరోసా ఇచ్చారు. గతంలో ఖాళీ ట్యాంకర్లను ఉత్పత్తి కేంద్రాలకు తీసుకెళ్లడానికి 45 రోజులు పట్టేది, ఇప్పుడు వైమానిక దళం విమానాల వల్ల 12 గంటల్లోనే అది జరుగుతోందన్నారు.
కంటైన్‌మెంట్ వ్యూహంతో తగ్గనున్న ఉధృతి ః హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా
కొవిడ్ ఉధృతిని తగ్గించేందుకు అనుసరించాల్సిన కంటైన్‌మెంట్ వ్యూహం గురించి హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా వివరించారు. ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్రాలకు తెలియజేసిందని గుర్తు చేశారు. కొవిడ్ తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి స్థానికంగా కంటైన్‌మెంట్లను ఏర్పాటు చేయాలని జిల్లాల అధికారులకు ఆయన సూచించారు. తీవ్రత ఉన్న జిల్లాలు, పట్టణాలు, ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని తెలిపారు. తీవ్రతను బట్టి గ్రేడ్లుగా విభజించి చర్యలు చేపట్టడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఆయన సూచించారు. ఈ విధమైన వ్యూహంతో చర్యలు ప్రారంభిస్తే త్వరలోనే కేసుల గ్రాఫ్‌ను తగ్గించగలమని ఆయన తెలిపారు.
రెమ్‌డెసివిర్ మ్యాజిక్ బుల్లెట్ కాదు..!: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా
పాజిటివ్ వచ్చినవారంతా ఆందోళన చెందొద్దని ఎయిమ్స్ డైరెక్టర్ డా॥రణదీప్‌గులేరియా హితవు పలికారు. స్వల్ప లక్షణాలుండి, ఆక్సిజన్ లెవల్స్ సరిపడినంత ఉన్నవారు కూడా ఆస్పత్రుల్లో చేరి ఆక్సిజన్ పెట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అలాంటివారి వల్ల అవసరమైనవారికి ఆక్సిజన్ అందించలేని పరిస్థితి తలెత్తుతున్నదని ఆయన వివరించారు. రెమ్‌డెసివిర్ విషయంలోనూ ప్రజల్లో అతి అంచనాలున్నాయని ఆయన అన్నారు. అదేమీ మ్యాజిక్ బుల్లెట్ కాదని ఆయన స్పష్టం చేశారు. దాని వల్ల మరణాల రేట్ తగ్గుతున్నట్టు నిర్ధారణ కాలేదన్నారు. మొదటి, రెండు రోజుల్లో దానిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయని కూడా ఆయన తెలిపారు.
Time to Wear Mask even at home says Centre Govt