బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ కావడం అందరినీ ఆశ్చర్యపరచింది. క్రికెట్ లో ఇలాంటి నిబంధన ఒకటి ఉందన్న విషయం ఇంతవరకూ తెలియని అభిమానులు, టైమ్డ్ ఔట్ అయిన క్రికెటర్ల గురించి నెట్ లో తెగ వెతికేస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ క్రికెట్ లో టైమ్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్ మాథ్యూస్ మాత్రమే. దేశవాళీ క్రికెట్ లో మాత్రం ఇలా అవుటైన క్రికెటర్లు ఆరుగురున్నారు.
టైమ్డ్ ఔట్ అయిన మొట్టమొదటి క్రికెటర్ ఆండ్రూ జోర్డాన్. దక్షిణాఫ్రికాకు చెందిన జోర్డాన్ 1988లో ఈస్ట్ ప్రావిన్స్- ట్రాన్స్వాల్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలా అవుటయ్యాడు. పాపం, వరదల కారణంగా సకాలంలో స్టేడియానికి రాలేకపోవడంతో అతను టైమ్డ్ ఔట్ అయ్యాడు.
ఇండియాకు చెందిన హేములాల్ యాదవ్ టైమ్డ్ ఔట్ అవుటైన రెండో క్రికెటర్. 1997లో త్రిపుర-ఒడిసా మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో డ్రింక్స్ విరామం పూర్తయ్యాక త్రిపుర బ్యాట్స్ మన్ హేములాల్ సకాలంలో క్రీజ్ లోకి రాలేదు. దాంతో అంపైర్లు అతన్ని టైమ్డ్ ఔట్గ్ గా ప్రకటించారు.
వెస్టిండీస్-శ్రీలంక మధ్య 2002-03లో సూపర్ స్పోర్ట్స్ సీరీస్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో విండీస్ ఆటగాడు వాస్బర్ట్ డ్రేక్స్ విచిత్రమైన పరిస్థితుల్లో టైమ్డ్ ఔట్ అయ్యాడు. విమానం ఆలస్యం కావడంతో అతను సకాలంలో స్టేడియానికి రాలేకపోయాడు.
నాటింగ్ హామ్- డర్హామ్ మధ్య 2003లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్ ఆండ్రూ హారిస్ కూడా టైమ్డ్ ఔట్ అయిన క్రికెటర్ల జాబితాలో ఉన్నాడు. మ్యాచ్ లో బౌలింగ్ చేస్తుండగా హారిస్ గాయపడ్డాడు. దాంతో వైద్యుల సలహాపై విశ్రాంతి తీసుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లాడు. ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి, హారిస్ ను రమ్మంటూ కబురు పంపింది. అతను రావడం లేటయ్యేసరికి అంపైర్లు టైమ్డ్ ఔట్ గా ప్రకటించారు. వెస్టిండీస్ క్రికెటర్ రాన్ ఆస్టిన్, జింబాబ్వే ఆటగాడు చార్లెస్ కుంజ్ కూడా ఇలాగే టైమ్డ్ ఔట్ అయ్యారు.