మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియామకాల భర్తీకి సంబంధించిన పరీక్షలను కూడా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.నిరుద్యోగ భృతి అని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఉద్యోగం లేక ప్రాణాలు తీసుకుంటున్న చెట్టంత బిడ్డలని కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించారు.
ఘనంగాబతుకమ్మ ఉత్సవాలు:
బతుకమ్మ ఉత్సవాలను వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. లోటస్‌పాండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అక్కా చెళ్లెల్లందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలు పువ్వులనే దేవతలుగా మలిచి పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ప్రత్యేకమైన పండగ బతుకమ్మ అని అన్నారు. బతుకమ్మ ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు షర్మిల పేర్కొన్నారు.