‘జ్ఞానపీఠ్’ దేశవ్యాప్తంగా రచయితలు కోరుకునే అత్యుత్తమ సాహితీ పురస్కారం. ఆ పేరెత్తగానే దానిని పొందిన తమ భాష, రాష్ట్రానికి చెందిన రచయితలు గుర్తుకు వస్తారు. దాని గురించి తెలిసిన తెలుగువారికి విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డి, రావూరి భరద్వాజల పేర్లు స్మృతికొస్తాయి. అయితే దేశంలో అంత గొప్ప అవార్డును ఇస్తున్నదెవరు అనే వైపు చాల మంది ఆలోచన పోకపోయి ఉండొచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నడుపుతున్న జైన్ కుటుంబం 1965 నుండి ఏటా ఈ పురస్కారాన్ని బహుకరిస్తోంది. ఇలా రచయితలకు గౌరవ ప్రతిష్టల్నిఅందిస్తున్న ఆ సంస్థ ఇటీవల ఓ మూలా స్తంభాన్ని కోల్పోయింది. గత ఇరువై ఏళ్లుగా ఈ సంస్థకు అధ్యక్షురాలుగా ఉంటూ ఫౌండేషన్ దాతృత్వ సేవల్ని విస్తృతపరుస్తున్న మాతాజీ ఇందు జైన్ ఈ నెల 13 న కన్ను మూశారు. ఆమె వయసు 84 ఏళ్ళు. కరోనా ఆమెను కబళించింది.
ప్రపంచంలోనే ఎక్కువ కాపీలు అమ్ముడుబోయే ఆంగ్ల దినపత్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియాతో పాటు మరెన్నో పత్రికలు, టైం నౌ ఛానల్ నడిపే టైమ్స్ గ్రూప్ కు ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని పత్రిక వ్యాపారంలో 38 % ఈ సంస్థ వాటా ఉండడం ఇందు జైన్ సామర్థ్యానికి నిదర్శనం. 11 వేల మంది ఉద్యోగుల జేబులనే కాకుండా వారి కడుపులపై కూడా ఆమె ధ్యాస పట్టేదని ఉద్యోగులు చెప్పుకుంటారు.ప్రచురణ రంగంలో ఉద్దంఢుడైన భర్త అశోక్ కుమార్ జైన్ మరణం వల్ల 1999 లో ఇందు జైన్ టైమ్స్ గ్రూప్ పగ్గాలను చేపట్టారు. పత్రికలో అన్ని వర్గాలకు చెందిన శీర్షికలను ప్రవేశపెట్టి, అధిక వ్యాపార ప్రకటనలను ఆకర్షించి, తద్వారా పెరిగిన ఆదాయంతో ఇందు ఆసియాలోనే ధనిక మహిళగా నిలబడ్డారు. భారతీయ జ్ఞానపీఠ్ నిజానికి 1944 లోనే ఆరంభమైంది. ఇందు జైన్ మామగారైన సాహు శాంతి ప్రసాద్ జైన్ దీనిని స్థాపించి భాషా సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ఆర్థిక ప్రోత్సాహాన్నిఇస్తూ వచ్చారు ఎందరో రచయితలతో స్నేహం కలిగిన శాంతి ప్రసాద్ 1962 లో ధర్మవీర్ భారతి నేతృత్వంలో ౩౦౦ మంది రచయితలతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భారతీయ జ్ఞానపీఠ్ తరపున సాహిత్యానికి జాతీయ స్థాయి పురస్కారం ఇయ్యాలని నిర్ణయమైంది. 1965 లో అది కార్యరూపం దాల్చింది. ఆ నాటి నుంచి దాని బాధ్యత శాంతి ప్రసాద్ నుండి ఆయన కొడుకు అశోక్ జైన్ కు, ఆయన మరణంతో 1999 నుండి ఇందు జైన్ కు చేరింది. సమీర్, వినీత్, మరో అమ్మాయి వారి సంతానం. వీరిలో ఒకరు వారి పత్రికా సామ్రాజ్యంతో పాటు భారతీయ జ్ఞానపీఠ్ కు అధ్యక్షులు కావలసి ఉంది.
2000లో ఇందు జైన్ స్థాపించిన టైమ్స్ ఫౌండేషన్ ద్వారా ఆధ్యాత్మిక, దాతృత్వ సేవలను మరింత పెంచారు. ఆ సంస్థ సామజిక కార్యక్రమాలు, పత్రికారంగ పరిశోధనలు, ప్రకృతి విపత్తుల నిధి నిర్వహిస్తోంది.. 1983 లో ఫిక్కీ మహిళా విభాగానికి ఇందు తొలి అధ్యక్షురాలయ్యారు. ఇందు జైన్ ’ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సెయింట్స్ అండ్ సేజెస్’ పేరిట రెండు గ్రంథాలను 2012 మరియు 2019 లో రాశారు.2016 లో ఆమెకు పద్మభూషణ్ లభించింది. 2000 ఐక్యరాజ్యసమితి మిలీనియం సమ్మిట్ లో ప్రసంగించారు. 2018 లో దీర్ఘకాలం పత్రికారంగానికి చేసిన సేవకు ఆల్ ఇండియా మేనేజ్ మెంట్ అసోసియేషన్ మీడియా అవార్డును బహుకరించింది.
కొడుకులు పెద్దవాళ్ళైనా టైమ్స్ గ్రూప్ సారథిగా చివరి రోజువరకు తానే కొనసాగింది. మహిళలు వ్యాపార రంగంలోకి, నిర్వాహక బాధ్యతల్లోకి ఉత్సాహంగా, ధైర్యంగా వచ్చేందుకు తాను ప్రేరణగా నిలువాలని కోరుకుంది. 8 మార్చి 2010 నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకంగా 36 పేజీల టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక మహిళా సంచికను తీసుకొచ్చారు. దానిని ఆనాడు దేశ రాష్ట్రపతిగా ఉన్న మహిళ ప్రతిభా పాటిల్ తో విడుదల చేయించారు. జైన్ ల ఇంటి కోడలుగా వచ్చిన పిన్న వయసు నుండే ఆమె ప్రతి భారతీయ జ్ఞానపీఠ్ సమావేశాల్లో ఆ తర్వాత పురస్కార బహుకరణ వేడుకల్లో స్వయంగా అతిథుల వద్దకు వచ్చి పలకరించి, అన్నపానీయాలు అందించి మర్యాద చేసేవారని అంటారు.
శ్రీమంతురాలైన ఇందు జైన్ సామాన్య జీవితాన్ని ఇష్టపడింది. ఆమెకు బ్రహ్మకుమారీస్ సంస్థతో అనుబంధముంది. ఎప్పుడు ధవళ వస్త్రధారణతో సాధారణ మహిళలా ఆఫీసులో ఎంత దూరమైనా నడకకే ప్రాధాన్యతను ఇచ్చేది. సిబ్బంది సమావేశ సమ్మేళనాలలో స్వయంగా వడ్డించడం ఆమెకెంతో ఇష్టమని ఉద్యోగులు అంటారు. ఆమెకు దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మకవేత్తలతో గౌరవపూర్వక అనుబంధాలున్నా తన పాదాలు ,ఆలోచనలు నేలపైనే ఉండాలని కోరుకునేదని ఆమె తన సామజిక కార్యాచరణతో నిరూపించారు. ఇంత సేవాతత్పరత గల ఇందు జైన్ చివరి కోరిక తీరకపోవడం ఓ విషాదం. మరణాంతరం తన అవయవాలను దానం చేయాలని ఆమె కోరుకుంది. అయితే కరోనా సోకి మరణించినందున అది సాధ్యపడలేదు. వయసుకు మించిన ఉత్సాహంతో మహిళా సాధికారతకు, దాతృత్వ కార్యక్రమాలకు కాలం వెచ్చిస్తున్న ఇందు జైన్ కరోనా కోరలకు చిక్కడం చాల బాధాకరమైన విషయం. జ్ఞానపీఠమే కన్నీరు పెట్టే సన్నివేశం.