Sunday, November 24, 2024

టిప్పు సుల్తాన్ ప్రేమికులకు ఇక్కడ స్థానం లేదు: కర్నాటక బిజెపి అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: శ్రీరామచంద్రుడు, హనుమంతుడిపై భక్తి పాటలు పాడే వారే ఇక్కడ ఉండాలని, 18వ శతాబ్దానికి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ను ప్రేమించేవారు ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ కర్నాటక బిజెపి అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా మంగళవారం కొప్పల్ జిల్లాలోని ఎల్బుర్గాలో ఒక బహిరంగ సభలో కటీల్ ప్రసంగిస్తూ తామంతా శ్రీరాముడు, హనుమంతుడి భక్తులమని అన్నారు. తాము ఆంజనేయుడి బాటలో నడుస్తామని, టిప్పు సుల్తాన్ పిల్లలం కాదని ఆయన అన్నారు. టిప్పు సుల్తాన్ పిల్లలను ఇక్కడి నుంచి తరిమివేస్తామని ఆయన హెచ్చరించారు.

మీరు ఆంజనేయుడిని ఆరాధిస్తారా లేక టిప్పు సుల్తాన్‌ను పూజిస్తారా అంటూ ఆయన ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. టిపూ సుల్తాన్‌ను ప్రేమించే వారిని అడవులకు తరిమివేయాలా వద్దా అంటూ ఆయన అడిగారు. రామాయణంలో వానర రాజ్యం కిష్కంద క్షేత్రంగా ప్రజలు విశ్వసించే కొప్పల్ జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. హనుమంతుడు జన్మించినట్లుగా విశ్వసించే అంజనాద్రి పర్వతం కూడా ఇక్కడే ఉండడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News