Friday, January 24, 2025

శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గ‌త ఏడాది డిసెంబరు 30వ తేదీ నుండి జరిగిన అధ్యయనోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు. గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా ప్ర‌తి రోజు స్వామివారికి నివేదించారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు.

గురువారంనాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ”తన్నీరముదు” ఉత్సవం నిర్వహించారు. అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటిరోజు అనగా జ‌న‌వ‌రి 24న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయానికి వేంచేస్తారు.

ఘనంగా ”తిరుమలనంబి తన్నీరముదు” ఉత్సవం

శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాదీ నిర్వహించే ”తన్నీరముదు” ఉత్సవం తిరుమలలో గురువారం ఘనంగా జరిగింది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధి ఆలయ ప్రదక్షిణముగా వాహన మండపానికి వేంచేపు చేస్తారు. తిరుమలనంబి ఆలయం నుండి ప్రదక్షిణ‌గా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని వాహన మండపానికి తీసుకొస్తారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు. అనంతరం ఆల‌య అర్చ‌కులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమలనంబి రచించిన ”తిరుమొళి పాశురాలను” పారాయణం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, తిరుమల చిన్న జీయర్ స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News