Monday, December 23, 2024

జనవరి 1న సర్వదర్శనం టోకెన్లు..

- Advertisement -
- Advertisement -

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300/ ఎస్‌ఇడి టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక గల 2, 3 సత్రాలు, ఆర్‌టిసి బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్‌పి హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి ఒకటో తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని తెలిపారు. భక్తులు టిటిడి వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. తిరుమలలో వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే ముందు వచ్చిన వారికే ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యసదుపాయాలు కల్పిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News