మనతెలంగాణ/ హైదరాబాద్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు పరితపించి పోతారు.. గంటల తరబడే కాదు.. రోజుల తరబడి కూడా క్యూలైన్లలో భక్తులు వేచిఉండే సందర్భాలు ఎన్నో ఉంటాయి.. స్వామి వారి క్షణకాలం దర్శనార్థం వేల కిలోమీటర్ల దూరం నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో మంది.. వీఐపీలు ఓవైపు.. సామాన్యు భక్తులు మరోవైపు.. టికెట్లపై కొందరు.. ధర్మదర్శనం ద్వారా ఎంతో మంది.. కాలినడక వచ్చి శ్రీవారిని దర్శించుకునేవారు.. ఇలా తిరుమల గిరులు ఎప్పుడూ భక్తులతో రద్దీగానే ఉంటాయి.. అయితే రెండు రోజుల పాటు స్వామి వారి దర్శనాలు నిలిచిపోనున్నాయి.. అక్టోబర్ 25న సూర్యగ్రహణం కారణంగా.. నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా స్వామి వారి దర్శనాలు నిలిపివేయనున్నారు.. ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసే ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
అక్టోబర్ 25న నవంబర్ 8న 12 గంటల చొప్పున దర్శనాలు నిలిచిపోతాయని.. అన్ని రకాల దర్శనాలు రద్దు చేస్తున్నాం.. కానీ, సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని.. గ్రహణ సమయంలో అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేయనున్నట్టు టిటిడి ప్రకటించింది.. అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.. ఈ కారణంగా ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయనున్నట్టు టిటిడి వెల్లడించింది.. నవంబర్ 8న మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఆ రోజు ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయని తెలిపింది తిరుమలకు వచ్చే భక్తులు.. ఆ రెండు రోజులను గమనంలోకి తీసుకొని తమ ప్రయాణాలు చేయాలని టిటిడి కోరింది.