Monday, December 23, 2024

జమ్మూ శివార్లలో బాలాజీ వెంకన్న

- Advertisement -
- Advertisement -

మజీన్ (జమ్మూ) : జమ్మూ కశ్మీర్‌లో గురువారం తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని భక్తుల సందర్శనకు ఆధ్మాత్మిక వాతావరణంలో ఆవిష్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. జమ్మూ శివార్లలోని మజీన్ ప్రాంతంలో ఈ బాలాజీ ఆలయాన్ని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా , కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, డాక్టర్ జితేంద్ర సింగ్‌లు ప్రారంభించారు. దిగువ శివాలిక్ అడవుల్లో 62 ఎకరాల సువిశాల స్థలంలో తిరుపతి బాలాజీ దేవాలయం నెలకొంది. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర మంత్రులు వేదోచ్ఛారణల నడుమ పూజాదికాలు నిర్వహించారు. తరువాత జమ్మూ ప్రాంత ప్రజలకు ఈ దేవాలయం అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమానికి జమ్మూ ప్రాంతంలోని ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు.

పూజలలో పాలుపంచుకున్నారు. ముందు దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు చెందిన భక్తులు అనేకులు కార్యక్రమానికి వచ్చారు. జమ్మూ కశ్మీర్ సనాతన ప్రయాణ ఘట్టంలో ఇది ఓ చారిత్రక పరిణామం అని , దేశానికి గర్వకారణం అని , ఇప్పుడు ఈ దేవాలయం భక్తుల కోసం తెరిచారని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా తెలిపారు. ముందుగా శ్రద్ధా భక్తులతో మహాసంప్రోక్షణ కార్యక్రమం సాగింది. ఘంటారావాలు, భక్తుల ఉత్సాహంతో జమ్మూ శివార్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఈ దేవాలయం ఆరంభించడం వల్ల జమ్మూ కశ్మీర్‌కు సరికొత్తగా మతపరమైన పర్యాటక మజిలీ వాతావరణం ఏర్పడుతుందని , ఆధ్యాత్మిక పర్యాటకంతో , మానసిక ప్రశాంతత ఆపాదించినట్లు అవుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాంత ఆర్థిక వెన్నుదన్నుకు వీలేర్పడుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఈ ప్రాంతంలో వేద పాఠశాల, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వైదిక సంస్కృతి, సంప్రదాయాలు విలసిల్లేందుకు మాతా వైష్ణవీదేవి బోర్డు, శ్రీ కైలాష్ జ్యోతిష్ , వేదిక్ సంస్థాన్‌లు, ఇతర అనేక సంస్థలు పలు విధాలుగా సహకరిస్తున్నాయని వివరించారు. ఈ ఆలయ ప్రారంభోత్సవం దశలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమ శుభ సందేశం వెలువరించారు. కొన్ని కారణాల వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్లు చెప్పారు. ఇక్కడికి తరలివచ్చిన భక్తులకు , యాత్రికులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం, వెంకన్న భక్తులకు శుభాకాంక్షలు అన్నారు. ఇక్కడి దేవాలయం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ భారత్ అంతా ఒక్కటే అనే సందేశం వెలువరిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు.

టిటిడి ఈ ఆలయాన్ని రూ 30 కోట్ల వ్యయంతో నిర్మించింది. దేశంలోని పలు ప్రాంతాలలో టిటిడి ఆధ్వర్యంలో బాలాజీ దేవాలయాలు నెలకొని అలరారుతున్నాయి. జమ్మూ ప్రాంతంలో ఇది అతి పెద్ద దేవాలయంగా ఉంది. తిరుమల ఆలయంలో ఉన్న పద్ధతులు , వ్యవస్థలన్నింటిని ఈ ఆలయంలో పాటించడం జరుగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News