Wednesday, January 22, 2025

సులభం..వెంకన్న దర్శనం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వెళ్లాలనుకునేవారికి తెలంగాణ పర్యాటక శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లే వారికోసం ఒక కొత్త ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించు కునేందుకు నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అలాగే ఎంతో మంది భక్తులు కాలినడక మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో ఎప్పుడూ తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

అయితే తిరుమల వెళ్లాలనుకునే వారికోసం తెలంగాణ టూరిజం మంచి ప్యాకేజీతో ముందుకు వచ్చింది. చాలా తక్కువ ధరలోనే ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. తెలంగాణ టూరిజం శాఖ వారు తిరుమల టూర్- తెలంగాణ టూరిజం పేరుతో ప్రతిరోజూ ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. రెండు రాత్రులు, ఒక పగలు ఉండే ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారు ఉచితంగా శ్రీవారి శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ టూర్‌లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం కూడా ఉంటుందని తెలంగాణ టూరిజం పేర్కొంది.

టూర్ ఇలా సాగుతుంది : మొదటి రోజు సాయంత్రం 5 గంటలకు బస్సులో ఈ టూర్ ప్రారంభమవుతుంది. కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, బేగంపేట్, బషీర్ బాగ్ వంటి పాయింట్ల నుంచి ప్రయాణికులను పికప్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడ స్థానికంగా ఉన్న ఆలయాలను చూసి తిరుమల కొండపైకి వెళ్తారు. అక్కడ శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరుపతి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది. అయితే టూర్ వెళ్లాలనుకునేవారు 7 రోజుల ముందు టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

టికెట్ ధర ఒక్కరికి ఇలా : ఈ టూర్ ప్యాకేజీలో పెద్దలకు రూ.3,800, పిల్లలకు రూ.3,040 ఛార్జ్ చేస్తున్నారు. ఈ టూర్ ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులోనే ప్రయాణించాలి. యాత్రికులు సొంతంగా ప్రయాణించి టూర్ ప్యాకేజీ టికెట్‌తో టీటీడీలో రిపోర్టు చేస్తే దర్శనానికి అనుమతి ఉండదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. అలాగే బుక్ చేసుకున్న తర్వాత టూర్ రద్దు చేసుకుంటే డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదని తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News