Wednesday, January 22, 2025

శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2023 జనవరి 14న ముగియనున్నాయి.

ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం…

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం…

12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పాపై పారాయ‌ణం పవిత్ర ధనుర్మాసం సంద‌ర్బంగా డిసెంబ‌రు 17 నుండి 2023 జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం చేయ‌నున్నారు. కాగా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదించిన భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యులు 900 సంవత్సరాల క్రితం తిరుమ‌ల‌లో పెద్ద‌జీయర్ మఠం ఏర్పాటు చేశారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న శ్రీ‌శ్రీ‌శ్రీ పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి సమక్షంలో శ్రీ పెద్ద జీయ్యంగారు మ‌ఠంలో నెల రోజుల పాటు ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వెలసి ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News