మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాల విస్తరణలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత, కొత్తల కలయికతో రాష్ట్ర నూతన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను నియమించింది. కరోనా సమయంలో తనదైన ప్రత్యేక నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన సాఫ్ట్‌వేర్ శారదకు రాష్ట్ర నాయకత్వంలో స్థానం కల్పించింది. ఈ దఫా వినూత్నంగా జోన్ల వారీగా ఇంఛార్జీ కార్యదర్శుల నియామకం చేశారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీటా ఆఫీస్ స్పేస్ కేటాయింపు జరగనుండటంతో పాటుగా సహా క్షేత్రస్థాయిలో కార్యక్రమాల విస్తరణ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సాంకేతికత యొక్క ఫలాలను మరింత మెరుగ్గా అందుకోగలిగేందుకు టీటాకు జిల్లా కలెక్టరేట్లు లేదా జిల్లా కేంద్రాల్లో వర్కింగ్ స్పేస్ కేటాయించాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కలెక్టర్లకు ఇటీవలే లేఖ రాసిన సంగతి తెలిసిందే.
టీటా ఏర్పాటు చేసే ఈ కేంద్రాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా టీటా కలిగి ఉన్న 30 చాప్టర్ల యొక్క సభ్యుల రూపంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పెట్టుబడులు వచ్చే అవకాశం, ఎన్నారైలు, స్టార్టప్‌లు ఏర్పాటు చేసేందుకు టీటా సమన్వయం చేసేందుకు ఈ వర్క్ స్పేస్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జిల్లాల్లో ఆఫీసు స్పేస్ రావడం, టీటా కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విస్తరించనున్న నేపథ్యంలో బాధ్యతలు పెరిగాయి. దీంతో రాష్ట్ర నాయకత్వం సభ్యుల సంఖ్య పెరిగింది. దీనికి తోడుగా జోన్లవారీ బాధ్యతలతో రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం సైతం టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల చేపట్టారు. క్షేత్రస్థాయిలో టీటా కార్యక్రమాలు సమన్వయం చేసేందుకు పాతకొత్త స్త్రీపురుష నాయకత్వం కూర్పుతో నూతనంగా రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకం చేపట్టారు. దీంతో పాటుగా ఈ దఫా అన్ని జిల్లాలు కవర్ అయ్యే విధంగా జోన్లవారీగా రాష్ట్ర సంయక్త కార్యదర్శులకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.
మెజార్టీ సభ్యులు పాత కమిటీలో ఉండగా.. సాఫ్ట్‌వేర్ శారద (శారద ఉందాడి)కు రాష్ట్ర నాయకత్వంలో స్థానం కల్పించారు. కోవిడ్ సమయంలో ఉద్యోగం పోయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా తన తండ్రి కూరగాయల వ్యాపారంలో ఆమె సహకరించారు. ఉద్యోగం కల్పిస్తామని పలువురు ప్రతిపాదించినప్పటికీ స్వయం ఉపాధి చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు. టీటా ద్వారా ఉచితంగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ నుంచి ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పట్టభద్రురాలు అయ్యారు. తాజాగా తనకు ఈ బాధ్యతలు కల్పించిన సందర్భంగా టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల సహా నాయకత్వానికి సాఫ్ట్‌వేర్ శారద కృతజ్ఞతలు తెలిపారు.