కోల్‌కత: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ ప్రశాంతంగా జరిగిందని తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) పేర్కొంది. అయితే, రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా హింస జరిగే అవకాశాలపై కేంద్రానికి ఎందుకు ఇంటెలిజెన్స్ సమాచారం అందలేదని, రైతులలో కొద్దిమంది ఆందోళనకారులు ఎర్రకోటకు ఎలా చేరుకోగలిగారని తృణమూల్ కాంగ్రెస్ ప్రశ్నించింది. ఎర్ర కోట సంఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న టిఎంసి డిమాండు చేసింది. భద్రతా వలయాన్ని ఛేదించుకుని కొందరు ఆందోళనకారులు ఎర్ర కోట వద్దకు ఎలా చేరుకోగలిగారని టిఎంసి సీనియర్ నాయకుడు దినేష్ ద్వివేది బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ప్రభుత్వానికి ముందుగా ఈ సమాచారం ఎందుకు అందలేదని, నిఘా వ్యవస్థ ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. గణతంత్ర దినోత్సవం నాడు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ ఎంతో ప్రశాంతంగా జరిగిందని, సింగూరులో 2006 డిసెంబర్‌లో భూ సేకరణకు వ్యతిరేకంగా టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ చేసిన 25 రోజుల నిరాహార దీక్షతో దీన్ని పోల్చవచ్చని ఆయన అన్నారు.
TMC criticises Centre over farmers storm Red Fort