కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు మాతంగి హజ్రాను అస్సోంకు చెందిన యోధురాలిగా ప్రధాని మోడీ తన ప్రసంగంలో పేర్కొనడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం తప్పుపట్టింది. చారిత్రక పరిజ్ఞానం అంతగా లేని మోడీ ఇటువంటి తప్పు చెప్పినందుకు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పశ్చిమబెంగాల్ టిఎంసి ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ప్రధాని ఎవరో రాసిన కథనాన్ని నాటకీయంగా చదవడమే తప్ప చరిత్ర ఏమిటో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. 1869 -1942 కాలానికి చెందిన స్వాతంత్య్ర పోరాట యోధురాలు మాతంగి హజ్రా ప్రస్తుత పుర్బా మిడ్నపూర్ జిల్లా తమ్లుక్ నివాసి. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రదర్శనకు ఆమె నాయకత్వం వహించగా, బ్రిటిష్ పోలీసులు ఆమెను కాల్చి చంపారు. ఆమె మరణం తీవ్ర సంచలనం కలిగించి స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఈ చారిత్రక నేపథ్యం తెలియక మోడీ పొరపాటు మాట్లాడారని టిఎంసి ధ్వజమెత్తింది.