లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌పై టిఎంసి నేత ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన ధన్యవాద తీర్మానంలో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ నేత మహువా మోయిత్రా వివిధ సమస్యల పట్ల ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. దీంతో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవి.. మోయిత్రా మాటలకు అంతరాయం కలిగిస్తూ లోక్‌సభ గౌరవార్థం ‘ప్రేమతో మాట్లాడండి, అంత కోపం తెచ్చుకోవద్దని కోరారు. సహనం, క్షమ, దయాలతోనే ప్రపంచం ఒక శక్తి దర్పణంలా ప్రకాశిస్తోందని కూడా అన్నారు. దీంతో మోయిత్రా ఒకింతా ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు ఆమె సోషల్‌మీడియా వేదికగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు మోయిత్రా మాట్లాడుతూ సహనం, క్షమాపణను తీసుకొస్తాం. కానీ వాటి వెనుక కొద్దిమొత్తంలో కోపంతో కూడిన ఆవేశం కూడా ఉంటుంది. నేను కోపంతో కాక ప్రేమతో మాట్లాడాలి అంటూ ఉపన్యాసాలివ్వడానికి మీరెవరని ప్రశ్నించారు. మీరు నిబంధనల నిమిత్తమే నన్ను సరిదిద్దగలరు. మీరేమీ లోక్‌సభకు మోరల్ సైన్స్ టీచర్ కాదు అంటూ ట్విట్టర్‌లో ఘాటుగా విమర్శించారు.