కోల్‌కతా : రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ రాష్ట్రంలో అడుగుపెట్టరాదని అధికార టిఎంసి బుధవారం స్పష్టం చేసింది. గవర్నర్ ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాజ్యాంగ విలువలను తొక్కిపెడుతున్నారు. ఆయన ఢిల్లీలోనే ఉంటే మంచిది. బెంగాల్‌కు రానవసరం లేదని టిఎంసి సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి సౌగథా రాయ్ మండిపడ్డారు. కీలక నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యవహరించడం రాజ్యాంగరీత్యా గవర్నర్ బాధ్యత. అయితే ఈ గవర్నర్ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన ప్రకటనలు తీవ్రస్థాయిపరిణామాలకు దారితీసేలా ఉన్నాయని విమర్శించారు.
ఈ విధంగా రాజ్యాంగయుతంగా వ్యవహరించకుండా ఉన్న గవర్నర్‌ను తాము ఇంతకు ముందెప్పుడూ చూడనేలేదని సౌగథ రాయ్ విమర్శించారు. టిఎంసి విమర్శను బిజెపి తిప్పికొట్టింది. టిఎంసికి గవర్నర్ పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ కనీస గౌరవం కూడా లేదని, మమత బెనర్జీ ప్రభుత్వం బుద్ధి మార్చుకుని ఇకనైనా రాజ్యాంగ ఉన్నత పదవుల విలువలను గుర్తించి గౌరవించాల్సి ఉందని బిజెపి అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి , గవర్నర్‌కు మధ్య రాజీలేని వివాదం సాగుతోంది. పలు దశల్లో ఇది ప్రజ్వరిల్లుతోంది. నాలుగురోజుల పర్యటనకు గవర్నర్ ఢిల్లీకి వెళ్లారు. కారణాలను తెలియచేయలేదు. బుధవారమే తాను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీని, ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను కలిశానని, వివిధ విషయాలపై వీరితో జరిపిన చర్చలు ఉపయుక్తంగా ఉన్నాయని గవర్నర్ ట్వీటు వెలువరించారు.