Monday, January 20, 2025

ప్రశ్నిస్తే కఠిన శిక్షలు తప్పవా!

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఎంసి ఎంపి మహువా మొయి త్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. లోక్‌సభ నుంచి ఆమెను బహిష్కరించాలని బిజెపి ఎంపి వినోద్ కుమార్ సోన్‌కర్ నేతృత్వంలోని నైతిక విలువల కమిటీ సిఫారసు చేయడంతో ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ ఓం బిర్లా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్టం కాబోదు. పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఈ కమిటీ ఆమోదించడానికి ముందే నివేదికలోని అంశాలు బయటకు రావడం, మొయిత్రా ఎంపి సభ్యత్వంపై వేటు వేసేలా కమిటీ సిఫారసు చేయబోతున్నదంటూ కథనాలు వెలువడటం గమనిస్తే ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నట్లు స్పష్టం అవుతుంది.
ఓ ఎంపిని లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయడం భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆరోపణలపై లోతుగా పరిశీలన జరుపకుండానే హడావుడిగా నిర్ణయం తీసుకున్నారా? అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి.

బిజెపి అదానీ వ్యవహారంపై తాను ప్రశ్నిస్తూ వున్నందుకే ఈ విధంగా చేస్తున్నారని మహువా మొయిత్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్త అదానీని ప్రశ్నించినందుకు ఎంతటివారైనా ‘భారీ మూల్యం’ చెల్లించుకోవాల్సి వస్తుందనే సంకేతం ఇటీవల కాలంలో పలు సందర్భాలలో ఇస్తున్నారు. ఇదే విషయమై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంతకు ముందు పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. పరువు నష్టం కేసులో భారత దేశ చరిత్రలో అంతటి ‘కఠిన శిక్ష’ను ఇంతకు ముందు మరెవ్వరికీ దేశంలో ఏ కోర్టు కూడా విధించకపోవడం గమనార్హం.
తాజాగా, చైనా నుండి నిధులు పొందుతున్నారన్న ఆరోపణలపై న్యూస్ క్లిక్ సంపాదకుడిని కూడా అరెస్ట్ చేశారు. ఆ సంపాదక బృందం సహితం ఆదానీ ఆర్థిక అక్రమాలపై వరుసగా కథనాలు రాస్తుండటమే కారణమనే ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ ఎంపి సంజయ్ సింగ్ కూడా ప్రశ్నిస్తూ వుండటమే కారణంగా దర్యాప్తు సంస్థల దృష్టిని ఆకట్టుకున్నారనే వాదన వినిపిస్తున్నది. మహువా మొయిత్రా విషయంలో సహితం వచ్చిన ఆరోపణల ఆధారంగా నిర్ధారణకు వచ్చి, ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలనే సిఫార్సు చేసే విధంగా తీవ్రమైన నిర్ణయాన్ని ఎథిక్స్ కమిటీ తీసుకుంది.

కానీ, ఆరోపణల తార్కికతను పరిశీలించే ప్రయత్నం చేసినట్లు కనబడటం లేదు. ఆమె లోక్‌సభలో ప్రశ్నలు వేసేందుకు డబ్బు తీసుకున్నారనే ప్రధాన ఆరోపణకు మద్దతుగా నగదు ఎప్పుడు, ఏ విధంగా బదిలీ జరిగిందో పరిశీలించినట్లు కనిపించదు.
ఆమెకు ‘ముడుపుల చెల్లించాను’ అని చెబుతున్న వ్యాపారవేత్తను ప్రశ్నించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. మహువా మొయిత్రా వత్తిడులకు లొంగిపోయేలా ‘బలవంతం’ కు గురయినట్లు దర్శన్ హీరానందానీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు మీడి యా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆమె ఒత్తిడులను కాదనలేకపోయానని చెప్పినట్లు చెబుతున్నారు. ఈ అఫిడవిట్ వాస్తవమైతే, హీరానందానీ వాస్తవానికి ఎంపికి ప్రశ్నలు అడగడానికి ‘ముడుపులు’ ఇచ్చి నేరానికి పాల్పడినట్లు స్పష్టం అవుతుంది. ఆయనపై ఎటువంటి క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయకుండానే ఆమెను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయడం పట్లనే ఆసక్తి చూపడం విస్మయం కలిగిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజు డిసెంబర్ 4న లోక్‌సభ ముందు ఈ 500 పేజీల నివేదికను ప్రవేశపెట్టే వరకు అందులో అసలు ఏముందో పూర్తిగా తెలిసే అవకాశం లేదు. అయితే, తనపై వచ్చిన ఆరోపణల సందర్భంగా మొయిత్రా వేసిన 62 ప్రశ్నలను కూడా కమిటీ పరిశీలించే ప్రయత్నమే చేయలేదు.

ఆ ప్రశ్నలను హీరానందానీ కోసం ఆమె తన లాగిన్ నుండి అడిగేందుకు అనుమతి ఇచ్చారా? లేదా ఆమె అడగాలి అనుకున్న ప్రశ్నలను ఆమె లాగిన్ ద్వారా పంపడం ద్వారా ఆయన ‘పోస్ట్ మెన్’ పని చేశారా? ఈ విధంగా ఆమె ప్రశ్నలను, ఆమె లాగిన్ ద్వారా పంపడానికి ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తి ఏమిటి? సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమకు సంబంధించిన ఉత్తర, ప్రత్యుత్తరాలకు సంబంధించి ఇతరుల సహకారం తీసుకోవడం సర్వసాధారణం. అదే విధంగా హీరానందానీకి చెందిన దుబాయ్ కార్యాలయం నుండి కేవలం సెక్రటేరియల్ సహాయాన్ని ఉపయోగించినట్లు మొయిత్రా చేస్తున్న వాదనకు చట్టబద్ధత లభిస్తుంది. అదేమీ లేకుండా ఆయా ప్రశ్నలు అడిగినందుకు ఆమె ఆ పారిశ్రామికవేత్త నుండి గాని లేదా మరెవరి నుండైనా గాని ‘ముడుపులు’ స్వీకరించినట్లయితే ఖచ్చితంగా నేరం కాగలదు. కానీ, ఆమె విషయంలో ఆ విధంగా జరిగినట్లు ఎటువంటి ఆధారాలను ఇప్పటి వరకు బహిరంగ పరచలేదు. హీరానందానీ సహితం నిర్దుష్ట ప్రశ్నలు అడిగినందుకు ఆమెకు ‘ముడుపులు’ చెల్లించినట్లు తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు ఎటువంటి కథనాలు వెలువడలేదు.

అయితే, హీరానందానీ కథనంలో వాస్తవాలను పరిశీలించేందుకు ఎథిక్స్ కమిటీ ఎటువంటి ప్రయత్నం చేయకుండా, ఆ బాధ్యతను సిబిఐ, ఇడి, ఆదాయ పన్ను శాఖలతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖపై పడవేసింది. అంటే, వాస్తవాలు నిర్ధారించుకోకుండానే ఆమె పార్లమెంట్ సభ్యత్వంపై వేటు వేసేందుకు తొందర పడటం వెనుక రాజకీయ ఉద్దేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెపై మొదటగా ఫిర్యాదు చేసిన న్యాయవాది జై అనంత్ దేహాద్రిని పిలిపించి విచారించిన ఎథిక్స్ కమిటీ, హీరానందానీని మాత్రం పిలిపించే ప్రయత్నం చేయలేదు. హీరానందానీని పిలిపించి ప్రశ్నించాలని కొంత మంది సభ్యులు సూచించినప్పుడు అంగీకరించి, అందుకు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే కమిటీ నివేదిక సిద్ధం చేయడం పట్ల ఒక సభ్యుడు గిరిధర్ యాదవ్ విస్మయం వ్యక్తం చేశారు. అనైతిక ప్రవర్తన, హీరానందానీ నుండి నగదు, బహుమతులను అందుకొని ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహువా నవంబర్ 2న కమిటీ ముందు హాజరైనప్పుడు చైర్మన్ మాత్రమే ముందుగా సిద్ధం చేసుకున్న ప్రతి నుండి ఆమెను వరుసగా ప్రశ్నలు అడిగారు. మిగిలిన సభ్యులు ఎవ్వరూ అడగలేదు. సమావేశానికి హాజరైన ముగ్గురు మహిళా ఎంపిలలో ఒక్కరు కూడా ఎలాంటి ప్రశ్నలను అడగలేదు.

ఆ ప్రశ్నల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ దుర్మార్గమైన, అనైతికమైన, స్త్రీ ద్వేషపూరితమై ప్రశ్నలని ఆరోపిస్తూ మొయిత్రా బయటకు వెళ్ళిపోయినా మహిళా సభ్యులైనా మాట్లాడలేదు. గత గురువారం కమిటీ సమావేశంలో 500 పేజీల నివేదికను ప్రవేశపెట్టి కేవలం ఐదు నిమిషాలలో ఆమోదించారు. కనీసం ఆ నివేదికను చదివేందుకు కూడా సభ్యులకు వ్యవధి ఇవ్వకపోవడం గమనార్హం. కనీసం ఎటువంటి చర్చ కూడా జరగానే లేదు. అంటే మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు భావించాల్సి వస్తున్నది. ఏదేమైనా వత్తిడులను ఎదుర్కొనే బలమైన వ్యక్తులను ప్రశ్నించే సాహసం చేసే ఎంతటి వారైనా తగు ‘మూల్యం’ చెల్లించాల్సి వస్తుందని పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
మహువా మొయిత్రా ఒక బ్యాంకర్‌గా ఆర్థిక వ్యవహారాలపై, అంతర్జాతీయంగా కంపెనీల వ్యవహారంపై తగు అవగాహన గల వ్యక్తి. తన అవగాహనతో ఆమె కీలకమైన ఆర్థిక అక్రమాలు జరిగినట్లు పార్లమెంట్‌లో వేసిన ప్రశ్నలు చాలా వరకు విధానపరమైనవి. అంతర్జాతీయంగా మీడియాలో ప్రముఖంగా వచ్చిన అంశాలకు సంబంధించినవే.

ఆమె అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పే పరిస్థితిలో లేకపోవడం గమనార్హం. ఏదేమైనా పార్లమెంట్ సమావేశాలు కొద్ది సంవత్సరాలుగా మొక్కుబడిగా సాగుతున్నాయి. విధానపరమైన చర్చలకు అవకాశం ఉండడం లేదు. కేవలం ప్రభుత్వం అనుకున్న బిల్లులను హడావుడిగా ఆమోదం పొందేటట్టు చేసుకుంటున్నది. మిగిలిన సమయం అంతా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలను దాట వేస్తుండటంతో పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా జరిగే ఆస్కారం కనిపించడం లేదు. అయినా తమ ప్రశ్నలపై పట్టుబట్టే వారికి మహువా వ్యవహారం ఒక హెచ్చరిక వంటిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News