కోల్‌కత: లోక్‌సభ ఎనికల ముందు వేగంగా పుంజుకుంటున్న ప్రతిపక్ష ఇండియా కూటమిని ఫిల్టర్ కాఫీగా టిఎంసి సీనియర్ నాయకుడు, అసన్‌సోల్ ఎంపి శత్రుహ్న సిన్హా అభివర్ణించారు. కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయరాదని, రాజకీయాలలో కిందపడి లేచిన చరిత్ర ఆ పార్టీకి ఉందని ఆయన అన్నారు. విప్లవాత్మకమైన యాత్రలను నిర్వహించినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన అభినందిస్తూ అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ గేమ్ చేంజర్‌గా మారనున్నారని ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్లను బిజెపి చేపట్టిన భారీ కుంభకోణంగా, బెదిరింపు వసూళ్ల రాకెట్‌గా ఆయన అభివర్ణించారు. ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపి సాగించిన బెదిరింపు, బ్లాక్‌మెయిల్ కుంభకోణాన్ని బట్టబయలు చేసేందుకు ప్రతిపక్షాలకు లభించిన గొప్ప అవకాశం ఏడు దశల ఎన్నికలని ఆయన అన్నారు.
ఈ ఎన్నికలలో బిజెపి ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. సిబిఐ, ఇది, ఐటి మద్దతు ఎన్‌డిఎకి ఉంటే ప్రజల మద్దతు ఇండియా కూటమికి ఉందని ఆయన అన్నారు. ఇండియా కూటమికి భాగస్వాములు లేరని చాలా మంది భావిస్తున్నారని, కాని ప్రజలే దానికున్న అతిపెద్ద అండదండలని ఆయన చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇండియా కూటమి బలం బాగా పుంజుకుంటోందని ఆయన చెప్పారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన అకిలేష్ యాదవ్, ఆర్‌జెడికి చెందిన తేజస్వి యాదవ్ వంటి చాలామంది నాయకులతో ఏర్పడిన ఇండియా కూటమిని ఫిల్టర్ కాఫీగా ఆయన అభివర్ణించారు. ఈ ఫిల్టర్ కాఫీ ఇతర పార్టీలతో పోలిస్తే చాలా బాంగుంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల తర్వాత ఇంకా చాలామంది నాయకులు ఇండియా కూటమిలో చేరతారని ఆయన అంచనా వేశారు.
ఇండియా కూటమికి కాంగ్రెస సారథ్యం వహించడాన్ని ఆప్, టిఎంసి వంటి పార్టీలు వ్యతిరేకించడాన్ని గురించి ప్రశ్నించగా ఏ ప్రతిపక్ష కూటమికైనా కాంగ్రెస్ వంటి అతి పెద్ద పార్టీ అండ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అని, ఆ పార్టీని పక్కనపెట్టలేమని ఆయన చెప్పారు. ఆ పార్టీకో చరిత్ర ఉందని, కిందపడినా మళ్లీ లేచిన చరిత్ర ఆ పార్టీకి ఉందని ఆయన చెప్పారు. 2019లో కూడా ప్రతిపక్షాలలో ఆ పార్టీకి వచ్చిన ఓటు శాతం ఎక్కువని ఆయన చెప్పారు. ఆప్, టిఎంసి జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములైనప్పటికీ పంజాబ్, బెంగాల్ వంటి రాష్ట్రాలలో ప్రతిపక్ష కూటమిలో ఎందుకు పొత్తులు కుదరలేదని ప్రశ్నించగా కొన్ని రాష్ట్రాలలో క్షేత్ర స్థాయిలో పొత్తులు కుదరకపోవడానికి కారణం ప్రతిపక్ష స్థానాన్ని బిజెపి భర్తీ చేయకూడదన్న ఉద్దేశంతోనేనని ఆయన చెప్పారు.
అధికారికంగా పొత్తులు కనిపించకపోయినప్పటికీ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ ప్రభంజనం సృష్టించవచ్చని ఆయన చెప్పారు. కొన్ని రాష్ట్రాలలో ప్రతిపక్ష కూటమిలో పొత్తులు లేనప్పటికీ ఎన్నికల తర్వాత అవి ఒక దగ్గరకు వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఒంటరిగానే 370కి పైగా సీట్లు గెలుస్తుందని, ఎన్‌డిఎ కూటమికి 400కి పైగా సీట్లు లభిస్తాయంటూ బిజెపి చేస్తున్న ప్రకటనలను ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రకటనలు బిజెపి కూటమి నిస్పృహతను తెలియచేస్తున్నాయని సిన్హా వ్యాఖ్యానించారు. మోసపూరిత చర్యలతోనే ఈ సంఖ్యను బిజెపి సాధించగలదని ఆయన ఆరోపించారు. కర్నాటక, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాగించిన బేరసారాల తరహాలోనే ఇప్పుడు కూడా చేస్తే అది సాధ్యం కావచ్చని లేనిపక్షంలో ఆ పార్టీకి 150 నుంచి 185 స్థానాలు మాత్రమే దక్కుతాయని ఆయన జోస్యం చెప్పారు.
ఎన్నికల బాండ్ల ద్వారా టిఎంసికి కూడా భారీగా విరాళాలు అందిన విషయాన్ని ప్రశ్నించగా బిజెపితో కాంగ్రెస్, టిఎంసి లేదా మరే ప్రతిపక్షాన్ని పోల్చలేమని, బిజెపి మాదిరిగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి నిధులు పొందలేదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ సాగించిన రెండు భారత్ జోడో యాత్రలను సిన్హా ప్రశంసించారు. రాహుల్ గాంధీని సమర్థుడైన నాయకుడిగా ఆయన అభివర్ణించారు. ఆయన రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డారని ఆయన చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీ గేమ్ చేంజర్ అవుతారని ఆయన తెలిపారు. ఏదేమైనా ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రధానిగా ఎవరు ఉండాలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి నిర్ణయించుకుంటాయని ఆయన చెప్పారు.
అటల్ బిహారీ వాజపేయి, అద్వానీ హయాంలో 1980వ దశకంలో బిజెపిలో చేరిన శత్రుఘ్న సిన్హా ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేశారు. బీహార్‌లోని పట్నా సాహిబ్ స్థానం నుంచి రెండుసార్లు బిజెపి ఎంపిగా గెలుపొందిన సిన్హా ప్రస్తుత నాయకత్వంతో విభేదించి బిజెపికి దూరమై 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. 2022లో టిఎంసిలో చేరిన సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని పారిశ్రామిక పట్టణం అసన్‌సోల్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2024 ఎన్నికలలో అదే నియోజక వర్గం నుంచి ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.