గోవా మహిళలకు టిఎంసి వాగ్దానం
పనాజీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) శనివారం ప్రకటించింది. గృహలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి నెలకు రూ. 5,000 చొప్పున నగదు బదిలీ చేస్తామని టిఎంసి తెలిపింది. ఈ పథకం కోసం త్వరలోనే కార్డులను పంపిణీ చేస్తామని టిఎంసి నాయకురాలు మహువా మొయిత్ర వెల్లడించారు. విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఉండే ఈ కార్డులు గోవాలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలులోకి వస్తాయని ఆమె చెప్పారు. గృహలక్ష్మి పథకం పరిధిలోకి గోవాలోని 3.5 లక్షల ఇళ్లకు చెందిన మహిళలు వస్తారని, రాష్ట్రంలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ ఆధార్ పథకానికి గరిష్ఠ ఆదాయ పరిమితి ఉండగా తమ ప్రభుత్వం అమలు చేయనున్న గృహ లక్ష్మి పథకానికి అటువంటి నిబంధన ఏదీ ఉండబోదని ఆమె చెప్పారు. అంతేగాక.. బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కింద కేవలం 1.5 లక్షల మంది మహిళలకు రూ. 1,500 మాత్రమే అందచేస్తున్నారని ఆమె వివరించారు.