కోల్‌కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించాలన్న రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ నిర్ణయాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. 2019 జులైలో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ధన్కర్పై గత ప్రభుత్వంలోనూ సత్సంబంధాలు లేని మమతా బెనర్జీ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆయన వ్యవహార శైలిపై మండిపడుతోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడడం అవాంఛనీయమని టిఎంసి ఎంపి కల్యాణ్ బంద్యోపాధ్యాయ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తనకు ఒక గవర్నర్ ఈ రకంగా వ్యవహరించడం ఎక్కడా చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.
హింసాత్మక సంఘటనలపై ప్రస్తుతం కలకత్తా హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో బాధిత ప్రాంతాలను గురువారం సందర్శించాలని గవర్నర్ నిర్ణయించుకోవడం ఈ కేసు విచారణను ప్రభావితం చేయడానికేనని ఆయన ఆరోపించారు. కూచ్బిహార్లో ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయడానికే గవర్నర్ వస్తున్నారని ఆ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రి రబీంద్రనాథ్ ఘోష్ ఆరోపించారు. కాగా, కూచ్‌బిహార్ జిల్లాలోని సీతల్‌కుచి, తదితర ప్రాంతాలను గవర్నర్ ధన్కర్ మే 13న బిఎస్ఎఫ్ హెలికాప్టర్లో సందర్శించి అక్కడి హింసాకాండ బాధితులను పరామర్శిస్తారని గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. అయితే, తన పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని గవర్నర్ తెలిపారు.