Monday, December 23, 2024

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి సాకేత్ గోఖలే అరెస్టు

- Advertisement -
- Advertisement -
‘ఫేక్ న్యూస్’ ట్వీట్ చేశాడన్న కారణంగా అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి సాకేత్ గోఖలేను గుజరాత్ పోలీసులు రాజస్థాన్‌లోని జైపూర్‌లో సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అక్టోబర్‌లో మోర్బీ వంతెన కూలి 130 మంది చనిపోయిన ఘటనస్థలిని ప్రధాని మోడీ సందర్శించిన అంశంపై ఆయన చేసిన ట్వీట్ కారణంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఇది బిజెపి రాజకీయ ప్రతీకార చర్య అని ఈ రోజు ఉదయం ఆరోపించింది.

‘కొవిడ్ టెస్ట్ తర్వాత అతడిని లాంఛనంగా అరెస్టు చేయడం జరిగింది’ అని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జితేంద్ర యాదవ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఓ పౌరుడి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశామని కూడా ఆయన తెలిపారు. ఫోర్జరీ, అపఖ్యాతి పాలుచేయడం(డిఫేమేషన్) అభియోగాలు అతడిపై పెట్టినట్లు వివరించారు. సాకేత్ గోఖలేను అహ్మదాబాద్‌కు మధ్యాహ్నం 2 గంటలకు తీసుకురానున్నారు. ఆ తర్వాతే స్పష్టత రాగలదని తెలుస్తోంది.
ప్రభుత్వం ఫ్యాక్ట్-చెక్ యూనిట్ గోఖలే ట్వీట్‌ను ఇటీవల తప్పుపట్టింది. “ప్రధాని మోడీ మోర్బీ సందర్శనానికి రూ. 30 కోట్లు ఖర్చయిందని ఆర్‌టిఐ పేర్కొంది” అని అతడు పేర్కొన్న ట్వీట్‌ను ఫ్యాక్ట్‌చెక్ యూనిట్ ‘ఫేక్’ (బూటకమైనది) అని డిసెంబర్ 1న పేర్కొంది.

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి సాకేత్ గోఖలే విమానంలో న్యూఢిల్లీ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కి రాగానే గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు అని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రీన్ ట్వీట్ చేశారు. “మంగళవారం ఉదయం 2 గంటలకు అతడు తన తల్లికి ఫోన్ చేసి గుజరాత్ పోలీసులు తనను అరెస్టు చేసి అహ్మదాబాద్‌కు తీసుకు వెళుతున్నారని, తాను మధ్యాహ్నం అహ్మదాబాద్ చేరుకుంటానని చెప్పాడు. పోలీసులు ఫోను చేసుకోడానికి అతడికి రెండు నిమిషాల వ్యవధిని మాత్రమే ఇచ్చి తర్వాత అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడి ఫోన్, ఇతర వస్తువులు స్వాధీనం చేసేసుకున్నారు” అని ఓబ్రీన్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడైన ఆయన ఇంకా “ఇదంతా చేసి తృణమూల్ కాంగ్రెస్‌ను, ప్రతిపక్షాన్ని నోరుమూయించలేరు. బిజెపి రాజకీయ ప్రతీకారాన్ని మరో స్థాయికి తీసుకెళుతోంది”అన్నారు. దీనిపై బిజెపి కానీ, గుజరాత్ ప్రభుత్వం కానీ ఇంత వరకు ప్రతిస్పందించలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News