ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమ్‌ఆద్మీ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినట్టు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు థాంక్యూ దీదీ అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. “ ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. మమత దీదీకి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.
థాంక్యూ దీదీ. మా మంచి చెడుల్లో మీరు ఎల్లప్పుడూ అండగా నిలిచారు ” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాజా పరిణామంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌నకు మద్దతుగా నిలిచిన ‘ ఇండియా కూటమి ’ మిత్రపక్షాల జాబితాలో తాజాగా ఆప్ చేరడం గమనార్హం. గతంలో సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించాయి. 2015 లో ఢిల్లీ లోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 67 స్థానాలు గెలుచుకుని తొలిసారి అధికారం లోకి వచ్చిన ఆప్, ఆ తర్వాత 2020 లో 62 సీట్లతో అధికారం నిలబెట్టుకుంది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం కృషి చేస్తోంది.