కోల్‌కతా : 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల పోరాటంలో విపక్షాల ఐక్యత వ్యూహంపై తృణమూల్ వైఖరిలో నెలకొన్న శూన్యతను మొట్టమొదటిసారి మమతాబెనర్జీ తొలగించ గలిగారు. “ఎక్కడ కాంగ్రెస్‌కు బలం ఉంటే అక్కడ వారిని పోరాటం చేయనిద్దాం. అక్కడ మనం అండదండలు అందిద్దాం. ఇందులో తప్పేమీ లేదు.
కానీ వారు కూడా ఇతర విపక్షాలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది ” అని ఆమె రాష్ట్ర సెక్రటేరియట్‌లో విలేఖరుల సమావేశంలో వివరించారు. సీట్ల సర్దుబాటు ఫార్ములా విషయంలో కూడా ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉంటాయో అక్కడ వారికి ప్రాధాన్యం ఇవ్వాలని తాను భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. బలమైన ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం కల్పించాల్సి ఉంటుందన్నారు. అంతకు ముందు కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయిన తరువాత అక్కడి ప్రజలకు మమతాబెనర్జీ వందనం చేశారు.