కోల్‌కత: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్‌పై శనివారం పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బిహార్ జిల్లాలో దాడి జరిగింది. ఈ ఏడాదిలో ప్రమాణిక్ కాన్వాయ్‌పై దాడి జరగడం ఇది రెండవసారి. శనివారం దిన్హటలో ప్రమాణిక్ కాన్వాయ్‌పై రెండవసారి దాడి జరిగింది.
దిన్హటలో మధ్యాహ్నం తమ కాన్వాయ్‌పై తృణమూల్ కాంగ్రెస కార్యకర్తలు దాడి చేశారని, ఈ దాడిలో పలువురు బిజెపి కార్యకర్తలు గాయపడడారని ప్రమాణిక్ తెలిపారు. తమ వాహనాలపై టిఎంసి కార్యకర్తలు బాణాలు కూడా వేశారని ఆయన ఆరోపించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ రేపుతున్న హింసాకాండకు రాష్ట్రమంతా తగటబడిపోతోందని ఆయన అన్నారు.దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోసించారని ఆయన తెలిపారు.
కాగా..ప్రమాణిక్ ఆరోపణలను టిఎంసికి చెందిన దిన్హట ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దయాన్ గుహా తోసిపుచ్చారు. కేంద్ర మంత్రే హింసకు ఆజ్యం పోస్తున్నారంటూ ఆయన ఎదురుదాడి చేశారు. పంచాయతి ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల స్క్రూటినీ ఆ ప్రాంతంలో జరుగుతున్న సమయంలో ప్రమాణిక్ తన అనుచరులతో అక్కడకు వచ్చారని, టిఎంకె కార్యకర్తలపై వారంతా దాడి చేశారని రాష్ట్ర మంత్రి తెలిపారు.