ప్రభుత్వ పథకాల గురించి వివరించిన తమిళనాడు సిఎం
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీ సమక్షంలోనే వీరి సమావేశం జరిగింది. భేటీ అనంతరం స్టాలిన్, రాహుల్ ట్విట్లు చేశారు. తమ సమావేశం హృదయపూర్వకంగా సాగిందని స్టాలిన్ తెలిపారు. తమిళనాడులో తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సోనియాకు స్టాలిన్ వివరించినట్టుగా చెబుతున్నారు. సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ సోనియాతో భేటీ కావడం ఇదే మొదటిసారి. గత నెల ఢిల్లీ వెళ్లిన స్టాలిన్ ఆ సమయంలో రాహుల్‌గాంధీతో మాత్రమే భేటీ అయ్యారు. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగస్వామి అన్నది తెలిసిందే. తమిళ ప్రజల అభివృద్ధి కోసం డిఎంకెతో కలిసి పని చేస్తున్నామని రాహుల్ ఈ సందర్భంగా ట్విట్ చేశారు. గురువారం ప్రధాని మోడీని కలిసిన స్టాలిన్ తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై పలు డిమాండ్లను ముందుంచారు.