Monday, December 23, 2024

కస్టడీలో నిందితుల పళ్లు పీకేసిన ఘటన: ఎఎస్‌పి సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: పోలీసు కస్టడీలో నిందితుల పళ్లు పీకేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబసముద్రం సహాయ పోలీసు సూపరింటెండెంట్(ఎఎస్‌పి) బల్వీర్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. అంబసముద్రం పోలీసు స్టేషన్‌లో 10 మంది నిందితులను ఎస్‌పి బల్వీర్ సింగ్ చిత్రహింసలకు గురిచేసి వారి పళ్లు పీకేసిన దారుణ ఘటనను ప్రతిపక్షాలు బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ఎఎస్‌పిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సబ్ కలెక్టర్ చేరన్‌మహాదేవి చేత దర్యాప్తునకు జిల్లా కలెక్టర్ ఆదేశించారని స్టాలిన్ తెలిపారు. ఎఎస్‌పిని బదిలీ చేసి వేకెన్సీ రిజర్వ్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు. పోలీసు స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘనలను తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితిలోను సహించబోదని ఆయన స్పష్టం చేశారు. అనుమానితుల పళ్లు పీకడంతోపాటు వారిని చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎఎస్‌పి బల్వీర్ సింగ్‌ను స్పెండ్ చేయవలసిందిగా తాను ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎఎస్‌పిపై తదుపరి చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.

అంబసముద్రం పోలీసు స్టేషన్‌లో ఎఎస్‌పి బల్వీర్ సింగ్ చేతిలో చిత్రహింసలకు గురైన బాధితులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ దీనిపై తక్షణమే స్పందించారు. తమ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులతోపాటు మరో ముగ్గురిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి బట్టలు విప్పదీసి లాఠీలతో చితకబాదారని, ఎఎస్‌పి బల్వీర్ సింగ్ కటింగ్ ప్లేయర్‌తో తమ పళ్లను పీకివేశారని చెల్లప్ప అనే బాధితుడు ఆ వీడియోలో వాపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News