చెన్నై : ప్రముఖ నటీనటులు నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసీ కేసుపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వెలువరించింది. దంపతులు సరోగసీ సంతానం విషయంలో నియమనిబంధనలు ఏమీ ఉల్లంఘించలేదని ఈ నివేదికలో స్పష్టం చేశారు. కృత్రిమ గర్భ ప్రక్రియ ద్వారా ఈ జంటకు ఇటీవలే ఇద్దరు మగపిల్లలు జన్మించారు. అయితే వీరు నిబంధనలను ఉల్లంఘించారనే వార్తలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు తరువాత నివేదికకు ఆదేశించింది. ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరిగతిన అన్ని అంశాలను పరిశీలించి దంపతులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. వీరి పిల్లల జనన ప్రక్రియ అంతా సవ్యంగా ఉంది. దీనిపై ఎటువంటి వివాదాలకు తావులేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ దీనిని ఇంతటితో ముగించివేయాలని సూచించింది. 2016లో నయనతార, విఘ్నేశ్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాతి దశలో వీరు ఓ మహిళతో సరోగసీ ఒప్పందానికి వచ్చారు. ఐసిఎంఆర్ నిబంధనల మేరకు ఒప్పందం కుదిరిందని ముగ్గురు వైద్య నిపుణులు, ఉన్నతాధికారులతో కూడిన కమిటీ నివేదిక తేల్చింది.