Wednesday, January 22, 2025

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

To eradicate drugs radically in Telangana:CM KCR

ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం! పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్ నాశనమై పోతుంటే ఎంత వేదన ఉంటది. డ్రగ్స్‌కు యువత ఎక్కువగా ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ధనికులు, పేదలు అనే తేడా లేకుండా అందరి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల అలవాట్లపై దృష్టి సారించాలి.
                                                                                                                 సిఎం కెసిఆర్

గ్రేహౌండ్స్ తరహాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు
రాష్ట్రాల సరిహద్దుల్లో అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు
స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల విధానాలను పరిశీలించాలి
మాదకద్రవ్యాల వాడకం రాష్ట్రంలో ఇంకా ప్రమాదస్థాయికి చేరుకోలేదు
మూసివేసిన పరిశ్రమలపై నిఘా
గ్రామంలో ఏ రైతు అయినా గంజాయి సాగు చేస్తే సమాచారం ఇవ్వాలి, లేకపోతే రైతుబంధు కట్
5సార్లకు మించి గంజాయి దొరికితే ప్రభుత్వ సబ్సిడీలు రద్దు
కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించాలి
రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారుల సదస్సులో ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం

ద్విముఖ వ్యూహం

1 ఇప్పటికే మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించాలి. వారి కుటుంబ సభ్యుల సహ కారం తీసుకొని డీ అడిక్ట్ చేయడం కోసం తగిన కార్యా చరణ రూపొందించాలి.

2 డ్రగ్స్ వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తిం చి, వారికి అందుతున్న డ్రగ్ నెట్‌వర్క్ లింక్‌ను నిర్మూలించడాన్ని అతి ముఖ్యమైన కార్యాచరణగా చేపట్టాలి. 

మన తెలంగాణ/హైదరాబాద్ : నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇది సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదన్నారు. దేశంలో కూడా జోరుగా విస్తృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సమూలంగా డ్రగ్స్‌ను నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో కృషి చేయాలన్నారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. ప్రత్యేకంగా వెయ్యి మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డిని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్నారు. ఈ విషయం లో ఏ పార్టీ కి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను కూడా నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సిఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో శుక్రవారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర పోలీసు,ఎక్సైజ్ అధికారుల సదస్సు జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి సిఎం కెసిఆర్ ప్రసంగిస్తూ, డ్రగ్స్‌ను నియంత్రించేందుకు బాధ్యత కలిగిన మానవులుగా ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేయాలన్నారు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని…దానిని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని సిఎం వ్యాఖ్యానించారు. అదే సమయంలో పోలీసు శాఖ కూడా మరింత సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. గ్రేహౌండ్స్ తరహాలోనే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గంజాయి, నార్కొటిక్ డ్రగ్స్‌తో పాటు ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి తదితర మాదక ద్రవ్యాల నెట్ వర్క్ ను గుర్తించి కఠినంగా నిర్మూలించాలన్నారు.

పలు అసాంఘిక శక్తులను…వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని సిఎం పేర్కొన్నారు. అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్‌ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు… రివార్డులతో పాటు ఆక్సెలరేషన్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు . ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే అనతికాలంలోనే తెలంగాణ అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని సిఎం అన్నారు.

స్కాట్ లాండ్ యార్డ్ పోలీసుల విధానాలను పరిశీలించాలి

డ్రగ్స్ మాఫియాను గుర్తించి, అరికట్టే క్రమంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలని సిఎం కెసిఆర్ సూచించారు. నిష్ణాతులైన చురకల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియాపై విజృంభించాలని స్పష్టం చేశారు. దీని కోసం స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అవలంబిస్తున్న విధానాలను పరిశీలించాలన్నారు. డ్రగ్స్ నేరస్థులను గుర్తించి పట్టుకునే దిశగా రాష్ట్ర పోలీసుఅధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలని సిఎం ఆదేశించారు. అవసరమైతే స్కాట్ లాండ్ యార్డ్ మాదిరిగా డ్రగ్ కంట్రోల్ చేస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించి రావాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. మన దేశంలో పంజాబ్ రాష్ట్రం కూడా డ్రగ్ కంట్రోల్ చేస్తోందని…ఆ రాష్ట్రఅధికారులను పిలిపించి వారితో శిక్షణ తీసుకోవాలన్నారు. దీని కోసం ఎంత ఖర్చయినా పర్వాలేదన్నారు. రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

నేర వ్యవస్థల మూలాలను పసిగట్టాలి

గంజాయి తదితర డ్రగ్స్ వ్యాపారం పంపిణీ, వినియోగం చేస్తున్న వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పసిగట్టాలని సిఎం అన్నారు. ఆ మూలాలనే దెబ్బతిసి డ్రగ్స్ కంట్రోల్ విషయాలలో రాష్ట్ర పోలీస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలని సిఎం ఆకాంక్షించారు. అభివృద్ధితో ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న రాష్ట్రంలో గంజాయి కొకైన్ ఎల్సీడి వంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే ఉందన్నారు. దానిని మొగ్గలోనే తుంచి వేయక పోతే, డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరితే మనకు అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు.

మన కళ్లముందే వారి భవిష్యత్ నాశనమైపోతుంటే….

ఎంత ధనం…. ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం! మన పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్‌కు బానిసలై వాళ్ళ భవిష్యత్ మన కండ్ల ముందే నాశనమై పోతుంటే ఎంతో వేదన ఉంటదని సిఎం అన్నారు. డ్రగ్స్ వినియోగం వైపు ఎక్కువగా యువత ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ధనవంతులు, పేదలు అనే బేధం లేకుండా అన్ని తరగతుల కుటుంబ సభ్యులు తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని తమ పిల్లల అలవాట్ల పై దృష్టి సారించాలని సిఎం కోరారు. డ్రగ్స్ వాడకం అత్యంత ప్రమాదకారని, దానిన కూకటివేళ్లతో నాశనం చేయకుంటే మనం సంపాదించే ఆస్తులకు, సంపాదనకు అభివృద్ధికి అర్థం లేకుండాపోతుందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ లో సభ్యసమాజం సహకారం తీసుకోవాలని సూచించారు. అందుకు గ్రామ సర్పంచులు, టీచర్లు, లెక్చరర్స్, విద్యార్థులతో సమావేశాలు సజావుగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.ఈ దిశగా స్ధానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా చైతన్యపరచలన్నారు.

సమాచారం ఇవ్వకపోతే ప్రభుత్వ సబ్సిడీలు.. రైతుబంధు బంద్

గ్రామంలో ఏ రైతు గాంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా…. ఆ సమాచారం అందించక పోతే ఆ గ్రామానికి రైతు బంధు తదితర సబ్సిడీలు రద్దు చేస్తామని సిఎం కెసిఆర్ హెచ్చరించారు.ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల గ్రామస్థులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

బాధ్యత… మనసు మీదికి తెచ్చుకుని కృషి చేయండి

డ్రగ్స్ నియంత్రణ అన్నది అధికారుల ఆదేశాలతోనో… ఉద్యోగమనో కాకుండా బాధ్యతతో మనసు మీదికి తీసుకుని పని చేయాలని సిఎం స్పష్టం చేశారు. అనుభవం ఉన్న ప్రతి అధికారిని డ్రగ్ కంట్రోల్ అంశంలో వినియోగించుకోవాలన్నారు.వ్యవస్థీకృత నేరాలను కంట్రోల్ చేస్తున్న విధంగా పిడియాక్ట్‌లు కూడా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మీరు ఏమి చేస్తారో ఏమో..ప్రభుత్వం మీకు పూర్తి సహకారం అందిస్తుంది.మీరు రాష్ట్రం లో డ్రగ్స్ వాడకం లో వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి చేపట్టాల్సిన అన్నిరకాల చర్యలు చేపట్టాలని డిజిపిని సిఎం ఆదేశించారు.

రాష్ట్రంలో ఇంకా ప్రమాదస్థాయికి చేరుకోలేదు

డ్రగ్స్ వాడకంలో రాష్ట్రం ఇంకా ప్రమాద స్థాయికి చేరుకోలేదని సిఎం అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని మొగ్గలోనే తుడిచేయాలన్నారు.నేరస్థులను పట్టుకొని విచారించే క్రమంలో కీలకమైన ‘ఫోరెన్సిక్ ల్యాబ్స్’ ను మరిన్నిటిని అత్యంత అధునాతన సాంకేతికతో ఏర్పాటు చేయాలన్నారు. న్యాయస్థానాల ముందు డ్రగ్స్ నేరస్థులను ప్రవేశపెట్టినప్పుడు కేసులు వీగిపోకుండా, నేరాలను రుజువు చేసేందుకు కావాల్సిన అన్నిరకాల ప్రాసిక్యూషన్ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.

క్లోజ్డ్ ఇండస్ట్రీపై నిఘా పెట్టండి!

రాష్ట్రంలో మూసివేసిన పరిశ్రమలు డ్రగ్స్ తయారీ పంపిణీ కేంద్రాలకు నెలవులుగా మారుతున్నాయని అధికారులు చేసిన సూచన పట్ల సిఎం ఘాటుగా స్పందించారు. తక్షణమే అటువంటి ‘క్లోజ్డ్ ఇండస్ట్రీ’లను గుర్తించి రూపుమాపాలని స్పష్టం చేశారు.
డ్రగ్స్ అక్రమ రవాణా నెట్ వర్క్‌ను దాని సాంద్రతను లోతుగా అధ్యయనం చేసి నియంత్రణ కార్యాచరణ అమలుచేయాలన్నారు. దీనిని నియంత్రించే విషయంలో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల మధ్య సమన్వయం సాధించాలన్నారు.
అలాగే అన్ని రకాల డ్రగ్ కంట్రోల్ విభాగాలను బలోపేతం చేయాలన్నారు.

ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపిలు బిబి పాటిల్, కవితా నాయక్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రెడ్యానాయక్, రవీంద్ర కుమార్ నాయక్, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, సాయన్న, రేఖా నాయక్, అబ్రహం, హ న్మంతు షిండేతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, పొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మాజీ డిజిపి అనురాగ్ శర్మ, సిఎంవో అధికారులు నర్సింగ రావు, భూపాల్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News