పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
కైరో: సైనిక పాలనకు నిరసనగా సూడాన్‌లో వేలాదిమంది వీధుల్లోకి వచ్చి ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రజాస్వామిక సంస్థల పిలుపుతో దేశ రాజధాని ఖార్‌టౌమ్, దాని జంట నగరం ఆమ్డర్‌మ్యాన్‌సహా పలు పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. డ్రమ్స్ చప్పుళ్లతో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ‘ వెనక్కి వెళ్లడం అసాధ్యం ’ అన్న బ్యానర్‌తో ప్రదర్శనలు చేపట్టారు. విప్లవం, విప్లవం అంటూ నినదించారు. సైనిక తిరుగుబాటు నేతల్లో ఒకరైన జనరల్ మొహ్మద్ హమ్దాన్ డగాలాతో ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రత్యేక రాయబారి వోల్కర్ పెర్తెస్ శుక్రవారం చర్చలు జరిపారు. శాంతియుత నిరసనలపై దాడులు చేయొద్దని జనరల్‌కు సూచించారు. ఇప్పటికే అమెరికాసహా పలు పాశ్చాత్య దేశాలు పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సైన్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. పౌర ప్రభుత్వం కూల్చివేత అనంతరం జరిగిన నిరసనల్లో సైనికుల కాల్పులు, దాడుల్లో ఇప్పటివరకు 9మంది చనిపోగా,కనీసం 170 మంది గాయపడినట్టు ఐరాస తెలిపింది.