ఎంపి కోమటిరెడ్డి స్కెచ్ ?
కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమావేశం
ఎవరూ ఆందోళన చెందవద్దని సూచన
ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరి పేరు సూచిస్తే వారికే టికెట్ అని ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్‌లో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యకర్తలతో భేటీ కావడం సంచలనంగా మారింది. శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నకిరేకల్ నేతలతో భేటీ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరపున అన్ని స్థానాలకు అభ్యర్థులు ఉన్నారని, కొత్తగా ఎవరూ చేరాల్సిన అవసరం లేదని గతంలో వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి వేముల వీరేశంను పార్టీలో ఆహ్వానించడానికా లేక అడ్డుకోవడానికా అన్న విషయమై ఇంకా తేలాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే ఎంపి కోమటిరెడ్డి కార్యకర్తలతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా ఎంపి కోమటిరెడ్డి తన అనుచరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి కార్యకర్తలు ఇబ్బందిపడొద్దని ఆయన సూచించారు. ఎవరో వస్తున్నారు అనే మాటలు, కథనాలు నమ్మి కార్యకర్తలు ఆవేశపడొద్దని, మీరు ఎవరి పేరు సూచిస్తే వారిని అభ్యర్థిగా ప్రకటిస్తామని వారికి ఆయన ధైర్యం చెప్పారు. రేవంత్ ఉచిత విద్యుత్ పై నోరు జారితే లాగ్ బుక్ బయట పెట్టింది నష్ట నివారణ చేశానని ఆయన వెల్లడించారు. బిఆర్‌ఎస్ కు రాజీనామా చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన వారితో పేర్కొన్నారు. బిఆర్‌ఎస్‌లో టికెట్ రాకపోవడం వల్లే కాంగ్రెస్‌లోకి వస్తానని అంటున్నారని ఎంపి తెలిపారు. పార్టీ విడిచి వెళ్లని వారు, కబ్జాలకు, బెదిరింపులకు, పాల్పడని వారు కాంగ్రెస్ పార్టీకి కావాలని, శాంతియుత నకిరేకల్ నియోజకవర్గమే తన లక్ష్యమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యకర్తలతో పేర్కొన్నారు.