దేహం ఎంత ధృఢంగా ఉన్నా..సిగరెట్, బీడీ అలవాటు ఉంటే?! చాలు పొగాకు దండయాత్రకు గేట్ తీసినట్టే.
పొగాకుతో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి, తెలుసుకోవటానికి వైద్యం చదవనవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెబుతుంది. ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్ర లో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు. కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు, ధూమపానం అలవాటుకు ఎలా బలయ్యాడు అని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది. అలాగే తెలుగు సినిమాకు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని, సమ”కూర్చిన” రచయితలు , కవులు,కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్లనే చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఒక్క సిగరేట్ చాలు అంటూ.. మొదలెట్టి మెల్లిగా..2,3,4 అలా ..రోజూ డబ్బా ఖాళీ చేసి పర్సు ఖాళీ చేసుకున్న అభాగ్యులు ఉన్నారు.
సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే.
దమ్ము కొట్టినపుడు సిగరెట్, బిడిలోనీ పొగాకుతో పెనవేసుకున్న రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాల డిఎన్ఏను నాశనం చేసే పనిలో పడతాయి.అంటే సరళంగా చెప్పాలి అంటే ఓ వ్యక్తి జాతకం ఎలా ఉన్నా..సిగరెట్ అలవాటు కు ముందు ,ఆ తర్వాత అని చెప్పొచ్చు. దొస్తుల వల్ల దమ్ము కొట్టడానికి అలవాటు అయిన వాళ్లు ఉన్నారు. అమ్మా, నాన్నలు ఇచ్చే పాకెట్ మనీ తో గుట్టుగా సిగరెట్ కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండి గా పైసలు ఉన్నా సద్వినియోగం చేసే వారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటు కు “దగ్గర” అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతే గాక కొన్ని సినిమా ల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్ లు సైతం యువత ను అటు వైపు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి పాఠశాల ల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు. అయినా..ఎవరో వచ్చి చెప్తేనే .. “బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్” అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.
సిగరెట్, బిడి కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఎంతటి ఉక్కు లాంటి కందరాల్ని ఐనా తుప్పు పట్టించే పనిలో ఉంటాయి. పటిష్ట మైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బ తీస్తాయి. కణాలు(సెల్స్)అడ్డగోలుగా పెరిగేలా కారకం అవుతాయి తద్వారా కేన్సర్ కు దారి తీస్తాయి.ఆరోగ్యం గా ఉన్న కణాల డి ఎన్ ఏ ను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాల పై ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో. ఓ వ్యక్తి ఆరోగ్యం కు కూడా కణాల ఆరోగ్యం అవశ్యం. సిగరెట్, బీడీ అలవాటు వల్ల కణాల డిఎన్ఏను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు. ఆ తర్వాత మెళ్లిగా రోగ నిరోధక శక్తి నీ దారుణంగా దెబ్బ తీస్తాయి. దీంతో దేహానికి పోరాడదాం అని ఆశ పడే సత్తాను కూడా సమాధి చేస్తాయి. వెరసి కణాలపై రాక్షసంగా దండ యాత్ర చేసి. దేహాన్ని జబ్బులతో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపిలో దిగబడ్డ ప్రాణిలా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి. మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకుతో దోస్తీ దేనికి. దూరంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్య కూడా మన దగ్గరే ఉంటుంది.
మాచన రఘునందన్
9441252121
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్