ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రశంస
న్యూఢిల్లీ: పొగాకు వినియోగాన్ని తగ్గించడంలో భారత్ సహా ఆగ్నేయాసియా దేశాలు సాధిస్తున్న పురోగతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా విభాగం ప్రశంసించింది. సమష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైందని, ఇకముందు కూడా కొనసాగాలని సూచించింది. ప్రపంచం లోనే అత్యధికంగా పొగాకు వినియోగదారులు ఆగ్నేయాసియా లోనే ఉన్నారు. ఇక్కడి జనాభాలో 29 శాతం అంటే 43.2 కోట్ల మంది ధూమపాన వ్యసనపరులు ఉన్నారు. గుట్కా వంటి ధూమపానేతల పొగాకు వినియోగం కూడా ఇక్కడ ఎక్కువే. ప్రపంచమంతా ఇలాంటివారు 35.5 కోట్ల మంది ఉంటే వారిలో 26.6 కోట్ల మంది ఆగ్నేయాసియా వాసులే.
2025 నాటికి 30 శాతం తగ్గుదల
హృద్రోగం, క్యాన్సర్ ,క్షయ వంటి అంటువ్యాధేతర రోగాల (ఎన్‌సిడి) వ్యాప్తికి పొగాకు వినియోగం దారితీస్తోంది. అంతర్జాతీయ ఎన్‌సిడి నిరోధ ప్రణాళిక నిర్దేశించిన ప్రకారం 2025 నాటికి పొగాకు వినియోగాన్ని 30 శాతం మేరకు తగ్గించడంలో భారతో, నేపాల్ సఫలం కానున్నాయి. పొగతాగడం వల్ల వచ్చే అనర్దాల గురించి సిగరెట్ ప్యాకెట్లపై పెద్ద అక్షరాలు, బొమ్మలతో భారత్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు హెచ్చరిస్తున్నాయి. ఎలెక్ట్రానిక్ సిగరెట్లను ఆరు దేశాలు నిషేధించాయి. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేసియాలు పొగాకు రైతులను ఇతర పంటలక మళ్లిస్తున్నాయి. ధూమపాన అలవాటు మాన్పించే ప్రయత్నాలను భూటాన్, నేపాల్, శ్రీలంక ముమ్మరం చేశాయి. ఈ ప్రయత్నాలన్నీ పొగాకు వినియోగాన్ని భారీగా తగ్గించడానికి దోహదపడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా విభాగం డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ వెల్లడించారు. 2000 సంవత్సరంలో 50 శాతం తగ్గింది.పొగాకు గిరాకీ, సరఫరాలను తగ్గించడానికి తీసుకున్న చర్యలే ఇందుకు కారణం. ఇవి ఇలాగే కొనసాగితే ఆగ్నేయాసియాలో ధూమపాన అలవాటు 2025 నాటికి 11 శాతానికి తగ్గుతుంది. అప్పటికి ఆఫ్రికాలో ధూమపాన అలవాటు 7.5 శాతంగా ఉంటుంది.