పరువు కోసం కివీస్, నేడు చివరి టి20
కోల్‌కతా: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మూడో ట్వంటీ20 మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ సాధించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలనే లక్షంతో కివీస్ కనిపిస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో భారత్ జయకేతనం ఎగుర వేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి కివీస్‌ను చిత్తు చేసింది. చివరి టి20లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టెస్టు సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధం కావాలనే పట్టుదలతో ఉంది.
జోరుమీదున్నారు..
ఇక టీమిండియాలో ఓపెనర్లు కెఎల్.రాహుల్, రోహిత్ శర్మలు జోరుమీదున్నారు. తొలి రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. రెండో టి20లో రాహుల్ కూడా కదం తొక్కాడు. ఈసారి కూడా చెలరేగేందుకు ఓపెనర్లు సిద్ధంగా ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. వీరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా టీమిండియాకు భారీ స్కోరు కష్టమేమీ కాదు. ఇటు రాహుల్, అటు రాహుల్ కొంతకాలంగా నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. ఇది టీమిండియాకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. రాహుల్ వరల్డ్‌కప్‌లోనూ సత్తా చాటాడు. ఈసారి కూడా జోరుమీదున్నాడు. రోహిత్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కీలక సమయంలో బ్యాట్‌ను ఝులిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు మరోసారి జట్టుకు కీలకంగా మారారు.
తడబడుతున్నారు..
మరోవైపు ఓపెనర్లు బాగానే ఆడుతున్నా కీలక సమయంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత టీమిండియా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. రెండో టి20లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తొలి మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ రెండో టి20లో నిరాశ పరిచాడు. ఈసారి అతను మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొలి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా విఫలమయ్యాడు. అందివచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. ఈసారైనా మంచి స్కోరును సాధించాల్సిన అవసరం అయ్యర్‌పై ఉంది. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ రెండో మ్యాచ్‌లో దూకుడుగా ఆడలేక పోయాడు. ధాటిగా ఆడడంలో విఫలమవుతున్నాడు. రిషబ్ పంత్ బాగానే ఆడుతున్నా అతని బ్యాటింగ్‌లో కూడా దూకుడు పెద్దగా ఉండడం లేదు. ఈ మ్యాచ్‌లోనైనా భారత బ్యాటర్లు ధాటిగా ఆడాల్సిన అవసం ఎంతైనా ఉంది.
బౌలర్లపై భారీ ఆశలు..
తొలి రెండు మ్యాచుల్లో కీలక సమయంలో భారత బౌలర్లు పుంజుకున్నారు. ఈసారి కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అశ్విన్, అక్షర్ పటేల్‌లు రెండు మ్యాచుల్లోనూ పొదుపుగా బౌలింగ్ చేశారు. అయితే రెండో మ్యాచ్‌లో దీపక్ చాహర్, భువనేశ్వర్‌లు భారీగా పరుగులు సమర్పించుకోవడం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు హర్షల్ పటేల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. అద్భుత బౌలింగ్‌తో మొదటి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అవేశ్ ఖాన్‌కు అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదు.
తక్కువ అంచనా వేయలేం..
ఇక తొలి రెండు మ్యాచుల్లో ఓడిన న్యూజిలాండ్ కనీసం ఆఖరి పోరులోనైనా గెలవాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగానే ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. కీలక సమయంలో వికెట్లను కోల్పోయి ఆశించిన స్కోరును సాధించలేక పోతోంది. ఇది జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణిస్తేనే కివీస్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి ఖాయం.