మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలకు మరో వారం రోజులే సమయం ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ రూపొందించుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ క్రమంలోనే తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ నేడు, రేపు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం మ. 1:30 గంటలకు హుస్నాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.
నేడు రాత్రి ప్రియాంక గాంధీ ఖమ్మంకు చేరుకొని రాత్రి అక్కడ బస చేయనున్నారు. 25వ తేదీన ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరులో ప్రియాంకగాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి సత్తుపల్లి చేరుకొని మధ్యాహ్నం అక్కడ ప్రచారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:40 నుంచి 3:30 వరకు మధిర ప్రచార సభలో ప్రియాంక పాల్గొననున్నారు. సభ అనంతరం అక్కడి నుంచి విజయవాడకు చేరుకొని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
రెండు రోజుల పాటు డికె శివకుమార్ పర్యటన
రెండురోజుల పాటు తెలంగాణలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ పర్యటించనున్నారు. నేడు, రేపు తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో డికె శివకుమార్ పాల్గొననున్నారు. నేడు బెంగుళూరు నుంచి ఉదయం హైదరాబాద్‌కు చేరుకొని 12 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గం కార్నర్ మీటింగ్‌లో డికె శివకుమార్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి వర్ధన్నపేట నియోజక వర్గంలో తర్వాత వరంగల్ వెస్ట్ నియోజక వర్గాలలో ప్రచార సభల్లో పాల్గొని రాత్రి అంబర్‌పేట నియోజక వర్గం కార్నర్ మీటింగ్‌లో డికె శివకుమార్ పాల్గొననున్నారు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లోని పలు నియోజక వర్గాల్లో రోడ్ షో లు, కార్నర్ మీటింగ్ శివ కుమార్ పాల్గొంటారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.