Sunday, January 19, 2025

నేడు ఉప్పల్‌లో భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్లలో ఒకరిగా పేరున్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సమరానికి బుధవారం తెరలేవనుంది. హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ (ఉప్పల్) స్టేడియం వేదికగా ఈ డే/నైట్ మ్యాచ్ జరుగనుంది. ఇటీవలే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కివీస్‌తో పోరుకు సిద్ధమైంది. మరోవైపు పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపై ఓడించిన న్యూజిలాండ్ కూడా జోరుమీదుంది. భారత్‌పై కూడా సంచలన విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

జోరు సాగాలి..

ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు ఫామ్‌లో ఉండడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. శ్రీలంక సిరీస్‌లో వీరిద్దరూ మెరుగైన ప్రదర్శన చేశారు. చివరి వన్డేలో శుభ్‌మన్ గిల్ శతకంతో అలరించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు కెప్టెన్ రోహిత్ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఉప్పల్ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఓపెనర్లు మరోసారి శుభారంభం అందిస్తే భారత్‌కు భారీ స్కోరు కష్టమేమీ కాదు.

అందరి కళ్లు విరాట్‌పైనే..

లంక సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. చివరి నాలుగు మ్యాచుల్లో ఏకంగా మూడు శతకాలు సాధించి జోరుమీదున్న కోహ్లి టీమిండియాకు చాలా కీలకంగా మారాడు. ఈ సిరీస్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న కోహ్లి తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే కివీస్ బౌలర్లు కష్టాలు తప్పక పోవచ్చు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక సిరాజ్, షమి, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్, షాబాజ్ అహ్మద్, చాహల్ వంటి ప్రతిభావంతులైన బౌలర్లు జట్టులో ఉన్నారు. హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలని తహతహలాడుతున్నాడు. సొంత గడ్డపై ఆడుతుండడంతో అందరి దృష్టి సిరాజ్‌పై నెలకొంది. షమి, కుల్దీప్‌లు కూడా మెరుగైన బౌలింగ్‌తో అలరిస్తున్నారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

తక్కువ అంచనా వేయలేం..

ఇక పర్యాటక న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా కివీస్‌కు ఉంది. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుత విజయం సాధించి జోరుమీదుంది. భారత్‌పై కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని తహతహలాడుతోంది. ఈ సిరీస్‌లో టామ్ లాథమ్ కివీస్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. కేన్ విలియమ్స్ సిరీస్‌లో ఆడడం లేదు. అంతేగాక సీనియర్లు సౌథి, బౌల్ట్ తదితరులు కూడా సిరీస్‌కు అందుబాటులో లేరు. అయితే ఫిన్ అలెన్, డెవోన్ కాన్వే, నికోల్స్, డారిల్ మిఛెల్, ఐష్ సోధి, బ్రేస్‌వెల్, సాంట్నర్ తదితరులతో కివీస్ చాలా పటిష్టంగా ఉంది. దీంతో సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ తప్పక పోవచ్చు.

జట్ల వివరాలు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, చాహల్, కుల్దీప్ యాదవ, శార్దూల్ ఠాకూర్, శ్రీకర్ భరత్, రజత్ పటిదార్, షాబాజ్ అహ్మద్.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవోన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిఛెల్, బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, మిఛెల్ సాంట్నర్, ఐష్ సోధి, ఫెర్గూసన్, టిక్నర్, జాకబ్ డఫ్లీ, డౌగ్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, హెన్రీ షిప్లే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News