Monday, January 20, 2025

సమరోత్సాహంతో గుజరాత్

- Advertisement -
- Advertisement -

నేడు బెంగళూరుతో పోరు

ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ ఏడింటిలో జయకేతనం ఎగుర వేసింది. కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించడంతో గుజరాత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇదే జోరును బెంగళూరు మ్యాచ్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హార్దిక్ సేన సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గుజరాత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

కోహ్లికి సవాల్..

మరోవైపు బెంగళూరు కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే కెప్టెన్ డుప్లెసిస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనైనా వీరిద్దరూ తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోహ్లి ఈ సీజన్‌లో ఘోర వైఫల్యం చవిచూస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కిందటి మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ కోహ్లికి సవాల్‌గా మారింది. డుప్లెసిస్, మాక్స్‌వెల్ తదితరులతో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి 115 పరుగులకే ఆలౌటైంది. ఇక వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా మారిన గుజరాత్‌ను ఓడించాలంటే బెంగళూరు ఈ మ్యాచ్‌లో అసాధారణ ఆటను కనబరచక తప్పదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News