Tuesday, November 5, 2024

నేడే ‘హుజూరా’ తీర్పు

- Advertisement -
- Advertisement -

Today Huzurabad by-election Counting of votes

కరీంనగర్‌లో ఉ.8గం.నుంచి ఓట్ల లెక్కింపు

22రౌండ్లలో పూర్తికానున్న లెక్కింపు పోస్టల్ బ్యాలెట్లు 753 కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రెండు హాళ్లలో కౌంటింగ్
ఒక్కో హాల్‌లో ఏడు టేబుళ్లు ప్రతీ రౌండ్‌కు 14 టేబుల్స్‌పై 14 ఇవిఎంలలో లెక్కింపు తేలనున్న గెల్లు, ఈటల, బల్మూరు భవితవ్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : హుజురాబాద్ ఉపపోరు ఉత్కంఠకు మంగళవారంతో తెర పడనుంది. మరికొన్ని గంటల్లో హుజురా‘బాద్’షా ఎవరో తేలనున్నారు. బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ (టిఆర్‌ఎస్), ఈటల రాజేందర్ (బిజెపి), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)ల మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. అందులోనూ ముఖ్యంగా టిఆర్‌ఎస్-, బిజెపిల మధ్య నువ్వా-నేనా అన్న స్థాయిలో హోరాహోరీగా ప్రచారం, ఓటింగ్ జరిగాయి. గెలుపుపై ఇటు గులాబీనేతలు, అటు కమలనాథులు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

ఓట్ల లెక్కింపు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర్ డిగ్రీ, పిజి కళాశాలలో ఉదయం 8 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి.కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రెండు హాళ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఒక్క హాల్‌లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్‌కు 14 టేబుల్స్‌పై 14 ఇవిఎంలను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఎలాంటి అవాంఛనీయ ఘనటలు జరుగకుండా ముందు జాగ్రత్తగా ఓట్లు లెక్కింపు నిర్వహించే కాలేజీ పరిసరాలలో పటిష్టత బందోబద్రత ఏర్పాటు చేశారు. హుజురాబాద్ నియోజవర్గంలోని మొత్తం 2,36,873 ఓట్లు ఉండగా, అందులో పురుషులు 1,17,779, మహిళలు 1,19,093 మంది ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 86.64 శాతం ఓట్లు పోలయ్యాయని అధికారులు వెల్లడించారు.

ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్లను లెక్కించాలని, కౌంటింగ్ సిబ్బందికి అధికారులు సూచించారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు వివి ప్యాట్‌లలోని స్లిప్పులను కూడా లెక్కించాల్సి ఉంటుందని, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ ల లెక్క సరిగ్గా ఉండాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ అబ్జర్వర్లు, పకడ్బందీగా ఓట్ల లెక్కింపు చెపట్టనుండగా, మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ సిబ్బంది చేపట్టే లెక్కింపు కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. కౌంటింగ్ సిబ్బంది అందరూ కొవిడ్ సర్టిఫికెట్లను, కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులను వెంట తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి సెల్ ఫోన్లు, పెన్నులు తీసుకురావద్దని తెలిపారు. ఒక్కో రౌండ్‌కు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.

మొదట హుజూరాబాద్ మండలం

ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట,కమలాపూర్ మండలాల లెక్కింపు జరుగుతుంది. హుజూరాబాద్‌లోని పోతిరెడ్డిపేట తొలి గ్రామం కాగా, కమలాపూర్ మండలం శంభునిపల్లి చివరి గ్రామం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు పంపించిన ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు జరుగుతుందని ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో ఎలాంటి సాంకేతిక సమస్య రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకోసం సిబ్బంది, సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చారు. సాయంత్రం 4 గంటల తర్వాత మొత్తం ఫలితం తేలనుంది. రికార్డ్ స్థాయిలో పోలింగ్‌తో టిఆర్‌ఎస్, బిజెపి ఉత్కంఠ కొనసాగుతోంది.

పెరిగిన పోలింగ్ శాతం

హుజురాబాద్ ఉప ఎన్నికలో పోలింగ్‌శాతం భారీగా నమోదైంది. మండలాలవారీగా హుజూరాబాద్ (85.66 శాతం), వీణవంక (88.66 శాతం), జమ్మికుంట (83.66 శాతం), ఇల్లందకుంట(90.73 శాతం), కమలాపూర్ (87.57 శాతం) భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. నియోజకవర్గంలో పురుషులు 87.05శాతం ఓటు వేయగా.. మహిళలు 86.25శాతం ఓటేశారు.వాస్తవానికి నియోజకవర్గంలో మహిళల సంఖ్య అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో పురుషులదే పైచేయిగా నిలవడం గమనార్హం. మొత్తం మీద 86.64 శాతం పోలింగ్ నమోదవడం అటు అధికారుల్ని, ఇటు రాజకీయ నేతల్ని ఆశ్చర్యపరిచింది. నియోజకవర్గంలో 2,36,873 మొత్తం మీద 20,5236 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిశాక కూడా చర్చనీయాంశంగా మారింది.

సైలెంట్ ఓటుపై ఇరుపార్టీల ధీమా..

హుజూరాబాద్ ఉప ఎన్నికలో సైలెంట్ ఓట్లు బాగా పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ (టిఆర్‌ఎస్), ఈటల రాజేందర్ (బిజెపి), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)ల మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. మిగిలిన ఇండిపెండెంట్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ముఖ్యంగా టిఆర్‌ఎస్-, బిజెపిల మధ్య నువ్వా-నేనా అన్న స్థాయిలో హోరాహోరీగా ప్రచారం, ఓటింగ్ జరిగాయి. దీంతో సైలెంట్ ఓట్లపై ఇప్పుడు విపరీతంగా చర్చ నడుస్తోంది. వీరు ఎవరిపక్షం వహించారన్నదే మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటు గులాబీనేతలు, అటు కమలనాథులు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లాభిస్తుందని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ ఉప పోరు ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News