Wednesday, January 22, 2025

చారిత్రక మ్యాచ్‌కు ‘భారత్ సిద్ధం’

- Advertisement -
- Advertisement -

Today India vs West Indies 1st ODI

జోరుమీదున్న విండీస్, నేడు తొలి వన్డే

అహ్మదాబాద్: చారిత్రక 1000వ వన్డే సమరానికి టీమిండియా సిద్ధమైంది. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టానికి ఆదివారం తెరలేవనుంది. టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలో 1000వ మ్యాచ్ ఆడనుంది. వెస్టిండీస్‌తో నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక వన్డే కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌కు ఎంతో ప్రాధాన్యత నెలకొంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. మరోవైపు బలమైన ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో వెస్టిండీస్ జయకేతనం ఎగుర వేసింది. ఆ విజయం నింపిన స్ఫూర్తితో విండీస్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. భారత్‌పై కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇక టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకంగా మారింది.

రోహిత్ కెప్టెన్సీకి సిరీస్ సవాల్‌గా తయారైంది. అంతేగాక ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా ఇది పరీక్షా సమయంగా చెప్పాలి. అతను కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. టెస్టుతో పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ ఓటమి పాలైంది. ఇలాంటి స్థితిలో సొంత గడ్డపై విండీస్‌తో జరిగే సిరీస్‌లో జట్టును విజయపథంలో నడిచేలా చూడాల్సిన బాధ్యత ద్రవిడ్‌పై నెలకొంది. రానున్న ఐపిఎల్ మెగా వేలం నేపథ్యంలో సిరీస్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. విండీస్ సిరీస్‌లో రాణించడం ద్వారా మెగా వేలం పాటలో జాక్‌పాట్ కొట్టేయాలనే లక్షంతో చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. ఇషాన్ కిషన్, దీపక్ హుడా, అవేశ్ ఖాన్, యజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తదితరులు సిరీస్‌లో రాణించాలనే లక్షంతో ఉన్నారు.

ఓపెనర్‌గా ఇషాన్?

ఇక సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కరోనా బారిన పడడంతో అతను ఈ చారిత్రక మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ పరిస్థితుల్లో ఇషాన్ కిషన్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసినా అతని క్వారంటైన్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో అతను తొలి వన్డేలో బరిలోకి దిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక కెఎల్. రాహుల్ తొలి వన్డేకు దూరంగా ఉన్నాడు. దీంతో ఇషాన్ కిషన్ రోహిత్‌తో పాటు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇక కెప్టెన్ రోహిత్‌కు సిరీస్ కీలకంగా మారింది. గాయం కారణంగా చాలా రోజుల తర్వాత రోహిత్ బరిలోకి దిగుతున్నాడు. దీంతో అతను ఎలా ఆడతాడన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా సిరీస్ సవాల్‌గా తయారైంది.

ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న కోహ్లి ఈసారైనా తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. కోహ్లి రాణించడంపైనే టీమిండియా భారీ స్కోరు ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేగాక సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లు కూడా జట్టుకు కీలకమే. ఇక దీపక్, శార్దూల్‌ల రూపంలో ఇద్దరు నాణ్యమైన ఆల్‌రౌండర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో దీపక్ హుడా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరాజ్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ ఫాస్ట్ బౌలర్లు కూడా సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. సీనియర్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లు కూడా అవకాశం దొరికితే సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు.

ఆత్మవిశ్వాసంతో పొలార్డ్ సేన..

మరోవైపు వెస్టిండీస్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఇంగ్లండ్‌పై సాధించిన విజయం విండీస్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కరీబియన్ టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. ఇక భారత పిచ్‌లపై కెప్టెన్ పొలార్డ్‌కు అపార అనుభవం ఉంది. ఇది కూడా విండీస్‌కు కలిసివచ్చే అంశమే. నికోలస్ పూరన్, షాయ్ హోప్, డారెన్ బ్రావో, జేసన్ హోల్డర్, బ్రూక్స్, కీమర్ రోచ్ తదితరులతో విండీస్ బలంగా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News