Monday, November 4, 2024

ప్రతిభ పరిశ్రమల సంగమం నిత్యానందరావు

- Advertisement -
- Advertisement -

Today is Acharya Nithyananda rao 60th birthday

 

ఆచార్య వెలుదండ నిత్యానందరావు అరవైలోకి అడుగుపెట్టబోతున్నారంటే ఎవరూ నమ్మరు. నలభై సంవత్సరాల సాహిత్యకృషిలో మూడు వేల పుటలు పైగా 7 సంపుటాల సాహిత్యాన్ని సృష్టించారన్నా అసలే నమ్మరు. వారిది వైవిధ్యానికి కొదువలేని సాహిత్యం. కథలు, కవితలు, నాటకాలు వంటి సృజనాత్మక సాహిత్యంతో పాటు పరిశోధనాత్మక విమర్శనాత్మక వ్యాసాలు కోకొల్లలు. ఇవికాక విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన (1987) అన్న ఎవరూ చేయ సాహసించని పనిని కూడా చేసి చూపించారు. తాపీ ధర్మారావు తన జీవితాన్నంతా ‘విజయవిలాస’ వ్యాఖ్యకు అంకితం చేశారంటారు. సి.పి.బ్రౌన్ ఇంగ్లండ్ తిరిగి వెళ్లిన తర్వాత కూడా తన నిఘంటువులను మరింత సమగ్రం చేయటానికి చరమదశ కాలాన్ని వెచ్చించారంటారు. అట్లే నిత్యానందరావు కూడా ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ ఉద్గ్రంధాన్ని సమగ్రం చేస్తూ ఇప్పటికి మూడు ముద్రణలు వేశారు! ‘పిన్నచేతి దివ్వె పెద్దగా వెలుగదాం’ అన్నట్టు పైలా పచ్చీసులో చేసిన ఈ కృషి ఉభయ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల వారికి బయటి ప్రాంతాల్లో తెలుగు శాఖలున్న విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు, పరిశోధక విద్యార్థులకు ఆచార్య బిరుదురాజు రామరాజుగా అన్నట్టు ‘కరదీపిక’.

కూచిమంచి జగ్గకవి (18వశ.) రచించిన ‘చంద్రరేఖా విలాపం’ తొలి వికట ప్రబంధంగా నిరూపిస్తూ నిత్యానందరావు చేసిన పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం 1988లో ఎం.ఫిల్ పట్టా ప్రదానం చేసింది. హాస్యం అపహాస్యం ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండేదాన్ని వికటత్వంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రబంధంలోని అవతారికలో, ఇతివృత్తంలో, వర్ణనల్లో, అనుకరణలలో కనిపించే వికటత్వాన్ని, కావ్య చారిత్రక నేపథ్యాన్ని తమ పరిశోధనలో సోదాహరణంగా నిరూపించారు. ఆ తర్వాత వారు ‘తెలుగు సాహిత్యంలో పేరడీ’ అన్న సరికొత్త అంశం మీద పరిశోధన చేసి 1990లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండే పిహెచ్.డి పట్టా పొందారు. ‘పేరడీ’ చేసే రచయితలు చాలామంది ఉన్నా, ఆ లక్షణాన్ని సమగ్రంగా నిర్వచించినవాళ్ళు ఎంతోమంది లేరు. ఈ నేపథ్యంలో నిత్యానందరావు చేసింది పూర్తిగా మౌలిక పరిశోధన అని చెప్పవచ్చు. పేరడీ అచ్చంగా స్వతంత్ర రచన కాదు, అది అభాస స్వతంత్ర రచన అనీ, ‘ఒక మాతృకకు అధిక్షేపాత్మకమైన, హేళనాత్మకమైన, హాస్యాత్మకమైన విషయాంతరంతో కూడిన అనుకరణమే పేరడీ’ అని నిత్యానందరావు నిర్వచించారు. ఇందుకు వారు అరిస్టాటిల్, మిల్టన్ వంటి మహారచయితల రచనలకు అధ్యయనం చేశారు.

తెలుగు కావాల నుండి ఆధునిక కవిత్వం నుండి, వచన సాహిత్యం నుండి కొల్లలుగా ఉదాహరణలు ఇచ్చారు. శ్రీశ్రీ విశ్వనాథల రచనలకు పేరడీలు ఎక్కువగా వచ్చాయి. జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి (జరుక్ శాస్త్రి) పేరడీలు రాయటంలో అద్వితీయులు కావటంలో వారికి పేరడీ శాస్త్రి అన్న పేరు స్థిరపడింది. శ్రీశ్రీ ‘నవకవిత’లోని అభ్యుదయ భావాలతో కూడిన ప్రతీకల్ని జరుక్ శాస్త్రి
‘మాగాయీ కంది పచ్చడీ / ఆవకాయి పెసరప్పడమూ

తెగిపోయిన పాత చెప్పులూ…’ అంటూ చేసిన పేరడీ బహుళ ప్రచారం పొందింది. విశ్వనాధ పద్యాలకు కూడా వీరు పేరడీలు రాసి హాస్యం పండించారు. శ్రీశ్రీ కూడా పేరడీలు రాశారు. ‘హాసవిలాసం’లో 14 వ్యాసాలున్నాయి. మన సాహిత్యంలో హాస్యరసం పండించినవారు తక్కువే. హాస్య రచనలకు సేకరించి, పరిశీలించి విశ్లేషించినవారిలో నిత్యానందరావు అగ్రగణ్యులు. వారిలో హాస్యప్రవృత్తి మెండుగా ఉండటమే ఇందుకు కారణం. ‘ఆకారంలో, మాటలో, వేషంలో, చేతలో వికృతత్వం చోటుచేసుకున్నప్పుడు’ హాస్యం పుడుతుందని ఆలంకారికులు చెప్తున్నారు. ఆత్మస్థమని, పరస్థమని హాస్యం రెండు రకాలని నిత్యానందరావు చెప్తున్నారు. చిలకమర్తి వారి ‘గణపతి’ తొలి సంపూర్ణ హాస్య నవల అంటున్నారు. పానుగంటి ‘సాక్షి’లోనిది వ్యంగ్య ప్రధాన హాస్యమని అంటూ మునిమాణిక్యం వారి కౌటుంబిక హాస్యానికి ఉదాహరణలిచ్చారు. గురజాడ ‘కన్యాశుల్కం’ ముగింపులోని ‘డామిట్! కథ అడ్డం తిరిగింది’ అన్న డయలాగ్‌ను మరచిపోలేమంటారు.

అయితే, నిత్యానందరావు ప్రధానంగా పరిశోధకులు. చిన్నవయసు నుండే పుస్తకపఠనం అలవాటయినవారు కావటం వల్ల సృష్టికి ప్రతిసృష్టి చేసే కళ అచ్చింది. ఇందుకువారు వెలువరిస్తున్న ‘సృజనానందం’ అన్న సంపుటి తార్కాణం. ఇందులో రేడియో నాటికలు, కథలు, కవితలు, లఘువ్యాసాలు దర్శనమిస్తాయి. నాటికలలో మొదట్లో కనిపించేది ‘కృతిస్వీకృతి’ (1992). ఇది కేతన తన కథాకావ్యమైన ‘దశకుమార చరిత్ర’ను తిక్కన సోమయాజికి అంకితం చేసే ఘట్టం ప్రధానంగా ఉన్న రచన. సహజంగా ఈ నాటికకు తిక్కన సోమయాజి కథానాయకుడు. అతని నాయక స్థానాన్ని మరింత పైమెట్టు మీదకు చేర్చే రెండు అంశాలను రచయిత కల్పించటం జరిగింది. వీటిలో ఒకటి వీరుడుగా మాత్రమే ప్రసిద్ధి చెందిన ఖడ్గ తిక్కన ద్వారా సాహితీవేత్తగా తిక్కన సొమయాజి మహనీయతను ప్రశంసాపూర్వకంగా ప్రస్తావన చేయించటం, రెండు ఒక కృతిని తనకు అంకితం చేయవలసిందిగా తిక్కనసోమయాజి స్వయంగా కేతనను అడిగినట్లుగా సాహిత్య చరిత్ర చెప్తుండగా, ఈ నాటికలో మాత్రం కేతన తమ ‘దశకుమార చరిత్రము’ అనే తొట్టలొలి కథాకావ్యాన్ని అంకితం తీసుకొనవలసిందిగా తిక్కనను ప్రార్థించటం.

ఈ రెండింటివల్ల తిక్కన సోమయాజి వ్యక్తిత్వం ఉన్నతీకరించడబడిందని చెప్పవచ్చు. ఈ ఘట్టంలోనే మనుమసిద్ధి మహారాజు ఉత్తర రామాయణాన్ని తమకు అంకితం చేయవలసిందిగా తిక్కనను కోరటంతో ‘నిర్వచనోత్తర రామాయణ’ రచనకు ప్రాతిపదిక ఏర్పడింది. అంతేకాదు నన్నయ్య అసంపూర్ణంగా వదలివేసిన మహాభారతాన్ని పూర్తి చేయవలసిందిగా రాజు కోరుతాడు. దీంతో తిక్కన అనువాద క్రతువుకు అరణి వెలిగించినట్లయింది. వీటి మూలంగా నాటికలో సాహిత్య వాతావరణం బలపడింది.

నిత్యానందరావు రాసిన కథల్లో ‘అశోకుడు నిర్మించిన నరకం’ ( 1984) ఒకటి. చైనా యాత్రికుడు ఫాహియాన్ రాసిన గ్రంథంలోని ఒక ఉదంతం ఆధారంగా చేసిన రచన ఇది. అశోక చక్రవర్తి తొలిదశలో క్రూరుడు. యమపురిలో పాపులను క్రూరంగా శిక్షించటాన్ని చూసి అట్లాంటిదాన్ని నిర్మింపజేస్తాడు. అత్యంత క్రూరుణ్ణి దానికి అధిపతిని చేసి అటువైపు ఎవరు వచ్చినా శిక్షించమని ఆదేశిస్తాడు. వాడు నిత్యానందుడనే బౌద్ద సన్యాసిని సలసల కాగుతున్న నీళ్ళ పాత్రలోకి విసిరేసి మూతపెట్టేస్తాడు. ఆ తర్వాత చూస్తే నిత్యానందుడు వేయిరేకుల కమలం మధ్యన ప్రశాంత వదనంతో కనిపిస్తాడు. ఈ అద్భుత మహిమ అశోకుడిలో పరివర్తనకు కారణమవుతుంది. బౌద్ధాన్ని స్వీకరించి నిత్యానందుని శిష్యుడయ్యాడు. హింస మీద అహింసది పైచేయి అయింది.

మహిమ మాధ్యమంగా నడిచే కథలకన్నా మానవ ప్రయత్నం ఆధారంగా నడిచే కథలు విలువైనవి . కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతం చూసిన అశోకుడు మానసికంగా మార్పు చెంది బౌద్ధం స్వీకరించాడన్నది మనకు తెలిసిన చరిత్ర. అంతకుముందే అతనిలో పరివర్తన వచ్చిందని ఈ ఉదంతం తెలుపుతున్నది. నిత్యానందరావు రాసిన కవితల్లో ‘జీవుని(ని)వేదన’ (భారతి, 1985) చెప్పుకోదగ్గది. ఇందులో రవీంద్రుని ‘గీతాంజలి’ ఛాయలు కనిపిస్తాయి. కవి వేదనలో విధేయత ధనిస్తుంది. తన మూర్ఖ సాహసం/ విశ్వవీణియ వెలిగింపు సుమధురగాన / జ్యోతిలో అమరకిరణంగా/ భాసించింది’ అనటంలో సంగీత కాంతుల సమ్మేళనంలో అమాయకభక్తి అమరత్వంగా వెలిగిందని చెప్పటం వల్ల కవి జీవుని సార్థకతను ధ్వనించాడు.

ఆచార్య నిత్యానందరావు ప్రతిభావంతుడు. ఇందుకు పరిశ్రమ తోడైంది. అందుకే అసమానమైన పరిశోధన విమర్శలు సాధ్యమయ్యాయి. సాహిత్యం జీవనాడి తెలిసిన నిత్యానందుడాయన. మరో రెండు దశాబ్దాల పాటు వారి నుండి పరిశోధనాత్మకమైన రచనలను మనం ఆశించవచ్చు. నేడు ఆచార్య నిత్యానందరావు 60వ పుట్టినరోజు పురస్కరిం చుకొని (సమగ్ర సాహిత్య సంపుటాల్లో మొదటి సంపుటి ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా…. )

                                                                                           అమ్మంగి వేణుగోపాల్
                                                                                              9441054637

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News