పాల్గొననున్న మంత్రులు,
పార్టీ జిల్లా అధ్యక్షులు
మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను ఆహ్వానించారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు అవసరమైన పరిస్థితులను ఈ సమావేశంలో కెసిఆర్ చాలా స్పష్టంగా వివరించనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై దసరా పండుగ రోజున కెసిఆర్ అధికారికంగా ప్రకటన చేస్తున్నారు.
ప్రకటన వెలువడిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరిగే విధంగా భారీ ఏర్పాట్లు జరిగే విధంగా మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు సూచించనున్నారు. అలాగే 5వ తేదీన తెలంగాణ భవన్‌లో జరిగే పార్టీ సమావేశం ఏర్పాటుపై కూడా ప్రాథమికంగా కెసిఆర్ చర్చించనున్నారు. జాతీయ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికల్లా అన్ని రాష్ట్రాలకు బలంగా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించనున్నారు. దీని కోసం కొందరు నేతలకు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులతో పాటుగా కొత్తగా అప్పగించే బాధ్యతలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించనున్నారు. ఇందుకు మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుల సూచనలు, సలహాలు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ స్వీకరించనున్నారు. అనంతరం వారితో కలిసి కెసిఆర్ లంచ్ చేయనున్నారు.