గెలుపుపై ఎవరి ధీమా వారిదే, నేడు ఇంగ్లండ్-భారత్‌ల మధ్య చివరి టి20
అహ్మదాబాద్: భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య ఆసక్తికరంగా సాగుతున్న ఐదు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. రెండు జట్ల మధ్య శనివారం ఐదో, చివరి టి20 మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే రెండు జట్లు 22తో సమంగా నిలిచాయి. ఆఖరి మ్యాచ్‌లో గెలిచే జట్టుకు సిరీస్ దక్కనుంది. ఇక కిందటి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. తీవ్ర ఒత్తిడిలోనూ చివరి వరకు నిలకడైన ఆటను కనబరుస్తూ భారత్ విజయాన్ని అందుకుంది. ఇక ఫలితాన్ని తేల్చే ఐదో టి20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా సిరీస్‌పై కన్నేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ సమతూకంగా కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచినా దాన్ని ఛేదించేందుకు చివరి వరకు పోరాడింది. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో సిరీస్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో చివరి మ్యాచ్ కూడా నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
ఈసారైనా శుభారంభం లభిస్తుందా?
ఓపెనర్ల వైఫల్యం టీమిండియాను వెంటాడుతోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచుల్లోనూ భారత్‌కు శుభారంభం లభించలేదు. శిఖర్ ధావన్, కెఎల్.రాహుల్, రోహిత్ శర్మలు ఓపెనర్లుగా దిగినా భారీ స్కోర్లు సాధించలేక పోయారు. రాహుల్ అయితే నాలుగు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. రెండు సార్లు డకౌట్‌గా వెనుదిరిగిన రాహుల్ తొలి టి20 ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కిందటి మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు. మరోవైపు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. రెండు సార్లు కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈసారైన తన బ్యాట్‌కు పనిచెబుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
జోరు కొనసాగించాలి..
మరోవైపు ఆడిన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయిన యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌పై అందరి కళ్లు నిలిచాయి. ఈ మ్యాచ్‌లో కూడా అతను జోరు కొనసాగించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సూర్య కళ్లు చెదిరే షాట్లతో కనువిందు చేశాడు. ఈసారి కూడా బ్యాట్‌తో విన్యాసాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఈ మ్యాచ్‌లో తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. కిందటి మ్యాచ్‌లో కోహ్లి విఫలమయ్యాడు. కానీ కీలకమైన మ్యాచ్‌లో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోహ్లి తనదైన రీతిలో చెలరేగితే భారత్‌కు భారీ స్కోరు కష్టమేమీ కాదు.
ఇక శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశమే. కిందటి పోరులో అయ్యర్ ధాటిగా ఆడాడు. క్లిష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. రిషబ్ పంత్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. కానీ, కీలక సమయంలో వికెట్‌ను పారేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇది జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లో పంత్ భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇక హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్, సుందర్, భువనేశ్వర్‌లతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కానీ, బౌలింగ్ ఒక్కటే భారత్‌ను కలవరానికి గురిచేస్తోంది. అయితే కిందటి మ్యాచ్‌లో హార్దిక్, భువనేశ్వర్, శార్దూల్‌లు రాణించడం భారత్‌కు ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి.
గెలుపే లక్ష్యంగా..
ఇంగ్లండ్ కూడా విజయమే లక్ష్యంగా పోరుకు సిద్ధమైంది. జాసన్ రాయ్, జోస్ బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, మోర్గాన్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. బట్లర్ విజృంభిస్తే ఆపడం భారత బౌలర్లకు చాలా కష్టం. మూడో మ్యాచ్‌లో బట్లర్ ఒంటిచేత్తో ఇంగ్లండ్‌ను గెలిపించిన విషయాన్ని ఇక్కడ మరచి పోకూడదు. ఇక మార్క్‌వుడ్, స్టోక్స్, జోర్డాన్, ఆదిల్, శామ్ కరన్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఇంగ్లండ్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.