ఆత్మవిశ్వాసంతో పాకిస్థాన్, గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, నేడు రెండో సెమీఫైనల్
దుబాయి: ఆస్ట్రేలియాతో గురువారం జరిగే టి20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌కు పాకిస్థాన్ సమరోత్సాహంతో సిద్ధమైంది. సూపర్12 దశలో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ పాకిస్థాన్ జయకేతనం ఎగుర వేసి సెమీస్‌కు దూసుకొచ్చింది. ఇక ఆస్ట్రేలియా తన గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా కనిపిస్తోంది. ఇక వరుస విజయాలతో జోరుమీదున్న పాకిస్థాన్ ఎలాగైనా ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా టైటిల్ రేసుకు చేరుకోవాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాకిస్థాన్ సమతూకంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా కూడా రెండు విభాగాల్లో బలంగా ఉంది. ఇక ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా పేరున్న ఆస్ట్రేలియాకు పొట్టి ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈసారి ఆలోటును తీర్చుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. ఊహించినట్టే నిలకడైన ఆటతో నాకౌట్ దశకు దూసుకొచ్చింది. ఇక గురువారం దుబాయి వేదికగా జరిగే రెండో సెమీస్‌లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇరు జట్లు కూడా విజయంపై దృష్టి పెట్టడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
వార్నర్‌పై భారీ ఆశలు..
ఇక ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకంగా మారాడు. ఐపిఎల్‌లో ఘోరంగా విఫలమైన వార్నర్ టి20 వరల్డ్‌కప్‌లో మాత్రం బాగానే ఆడాడు. పలు మ్యాచుల్లో జట్టును ఆదుకున్నాడు. విండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో వార్నర్ మెరుపులు మెరిపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. ఇక కీలకమైన పాక్ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ విజృంభిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ అరోన్ ఫించ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు.
ఇది జట్టును కాస్త కలవరానికి గురి చేస్తోంది. ఫించ్ మాత్రం ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక కిందటి మ్యాచ్‌లో మిఛెల్ మార్ష్ కూడా బ్యాట్‌ను ఝలిపించడం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాచ్చు. మార్ష్ కూడా రాణిస్తే ఆస్ట్రేలియాకు మెరుగైన స్కోరు ఖాయం. మరోవైపు స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వీరిలో ఏ ఇద్దరూ రాణించినా పాకిస్థాన్ బౌలర్ల కష్టాలు రెట్టింపు కావడం తథ్యం. బౌలింగ్‌లోనూ ఆస్ట్రేలియా చాలా బలంగా కనిపిస్తోంది. పాట్ కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్, ఆడమ్ జంపా, మార్ష్, స్టోయినిస్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. జంపా లీగ్ దశలో అదరగొట్టాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు.
సమరోత్సాహంతో..
మరోవైపు పాకిస్థాన్ కూడా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. లీగ్ దశను అజేయంగా ముగించిన పాకిస్థాన్ సెమీస్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలిచాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. రిజ్వాన్ కూడా జోరుమీదున్నాడు. ఇద్దరు మరోసారి జట్టుకు శుభారంభం అందించాలనే లక్షంగా ఉన్నారు. ఇక భారత్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఓడించడంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఫకర్ జమాన్, ఆసిఫ్ అలీ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక షాహిన్ అఫ్రిది, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.