Monday, January 20, 2025

నేడే సైకిల్ ట్రాక్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

పైకప్పుగా సోలార్ ప్యానెల్స్
రూ.100కోట్లతో రెండు మార్గాల్లో ట్రాకులు

నార్సింగి వద్ద ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
సుమారు రూ.100 కోట్లతో రెండు మార్గాల్లో ప్రాజెక్టుకు రూపకల్పన

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అధునాతన సైక్లింగ్ ట్రాక్ నిర్మాణాన్ని నేడు మంత్రి కెటిఆర్ సాయంత్రం 6 గంటలకు నార్సింగి వద్ద ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని 23 కిలోమీటర్ల మార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టగా పర్యావరణ పరిరక్షణ కోసం సైక్లింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జిసిఎల్) ఈ నిర్మాణాన్ని చేపట్టింది. గతేడాది సెప్టెంబర్‌లో మంత్రి కెటిఆర్ దీనికి శంకుస్థాపన చేయగా సుమారు రూ.100 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును రెండు మార్గాల్లో చేపట్టారు.
విదేశీయుల కోసం సౌకర్యవంతంగా…
ఐటీ నిపుణులను దృష్టి ఉంచుకొని తొలి దశ నిర్మాణాన్ని చేపడుతున్నారు. దేశంలోనే ఐటీ రంగానికి కీలక స్థానంగా ఉన్న హైదరాబాద్‌లో ఇలాంటి విన్నూత ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభు త్వం భావిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఎంతో సౌకర్యంగా, ప్రశాంతంగా ఇక్కడ జీవనం గడుపుతారు. అందుకే వివిధ రంగాల్లో నిపుణులు హైదరాబాద్‌లో ఉద్యోగం, వ్యాపారం చేయడానికి, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి సహజ సిద్ధమైన అనుకూలతలతో పాటు మౌలిక వసతులు కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు.
ట్రాక్ పొడవునా రెస్ట్‌రూంలు, కేఫ్‌టేరియాలు…
ఔటర్‌ను ఆనుకొని నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, కొల్లూరు నుంచి నార్సింగి వరకు 14.5 కిలోమీటర్ల మార్గంలో 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్లలో ఈ ట్రాక్‌ను నిర్మించారు. సైక్లింగ్ ట్రాక్‌లో సైకిళ్లపైన పరుగులు తీయడం కేవలం ఒక వ్యాయామ ప్రక్రియగానే కాకుండా ఒక విహారంలాంటి అనుభూతిని కలిగించే విధంగా దీనిని తీర్చిదిద్దారు. ట్రాక్ పొడవునా అక్కడక్కడా రెస్ట్‌రూంలు, కేఫ్‌టేరియాలు, బ్రేక్‌ఫాస్ట్ సెంటర్లు ఉంటాయి. అలాగే సైకిళ్లను ఇక్కడే అద్దెకు తీసుకోవచ్చు. పంక్చర్లయినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే మరమ్మతులు చేసి ఇస్తారు.
సైకిల్ ట్రాక్ యొక్క ప్రతిపాదిత వెడల్పు 4.5 మీ.లు కా గా, ఇరువైపులా 1.0 మీ.లు గ్రీన్ స్పేస్ కలిగి ఉంటుంది. సైకిల్ ట్రాక్ 23 కి.మీ పొడవు, 21 కి.మీల సోలార్ రూఫ్‌తో కప్పుతున్నారు. 16 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో రెస్కో మోడల్ ద్వారా సోలార్ ప్రాజెక్టును అమలు చేయాలని హెచ్‌ఎండిఏ ప్రతిపాదించింది. సుమారు 25 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టుకు తగ్గింపు ధరకు విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. హెచ్‌ఎండిఏతో పాటు హెచ్‌జిసిఎల్ అధికారుల బృందం దక్షిణ కొరియాను సందర్శించి అక్కడి సైకిల్ ట్రాక్‌లను అధ్యయనం చేసి ఇక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఈ ట్రాక్‌లను నిర్మించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News