Saturday, November 23, 2024

ఎవరు గెలిచినా చరిత్రే!

- Advertisement -
- Advertisement -

Today is the T20 World Cup final

సమరానికి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ రెడీ
నేడు టి20 ప్రపంచకప్ ఫైనల్

దుబాయి: దాదాపు నెల రోజులుగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను కనువిందు చేస్తున్న ట్వంటీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఆదివారం దుబాయి వేదికగా జరిగే తుది సమరంలో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనుంది. ఇప్పటి వరకు రెండు జట్లు కూడా ఒక్కసారి కూడా టి20 ప్రపంచకప్ ట్రోఫీ సాధించలేదు. దీంతో ఈసారి ట్రోఫీని ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటు ఆస్ట్రేలియా అటు న్యూజిలాండ్‌లు అసాధారణ ఆటతో ఫైనల్ సమరానికి దూసుకొచ్చాయి. రెండు జట్లు కూడా సెమీ ఫైనల్లో తమకంటే మెరుగైన జట్లను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించాయి.

ఇక తుది సమరంలోనూ అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ ట్రోఫీలను సాధించలేదు. ఆస్ట్రేలియా మాత్రం వన్డే ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో ట్రోఫీలను సొంతం చేసుకుంది. అయితే వన్డేల్లో చారిత్రక విజయాలు అందుకున్న ఆస్ట్రేలియాకు టి20 ప్రపంచకప్ ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే ఉంది. కానీ ఈసారి ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా కనిపిస్తోంది. న్యూజిలాండ్ కూడా తన వరల్డ్‌కప్ ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలని తహతహలాడుతోంది. వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు సార్లు ఫైనల్లో ఓటమి పాలైంది. ఈసారి మాత్రం ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాలని లక్షంగా పెట్టుకుంది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఓడించడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఫైనల్లో కూడా ఆస్ట్రేలియాపై అదే జోరును కనబరిచి ట్రోఫీని ముద్దాడాలని భావిస్తోంది.

జోరుమీదున్న వార్నర్..

మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకంగా మారాడు. పాకిస్థాన్ జరిగిన సెమీఫైనల్లో వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాటింగ్ వల్లే ఆస్ట్రేలియా భారీ లక్షాన్ని ఛేదించగలిగింది. ఈ మ్యాచ్‌లో వార్నర్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న వార్నర్ చెలరేగితే ఆసీస్‌కు ఎదురు ఉండదు. అయితే కెప్టెన్ అరోన్ ఫించ్ వరుస వైఫల్యాలు చవిచూడడం ఆస్ట్రేలియాను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫించ్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచ లేక పోయాడు. కనీసం ఈసారైనా బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక సీనియర్లు మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్‌లు కూడా భారీ స్కోర్లు సాధించడంలో విఫలమవుతున్నారు.

సెమీస్‌లో ఇద్దరు కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈసారి మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. ఇక కిందటి మ్యాచ్‌లో చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన స్టోయినిస్, మాథ్యూ వేడ్‌ల నుంచి జట్టు మరోసారి అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ఇద్దరి బ్యాటింగ్ వల్లే ఓడే మ్యాచ్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుని ఫైనల్‌కు చేరింది. మరోవైపు బౌలింగ్‌లో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్, జంపా, మిఛెల్ మార్ష్, స్టోయినిస్, మాక్స్‌వెల్ తదితరులతో బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా మారింది. వీరు మరోసారి రాణిస్తే కివీస్ బ్యాటర్లుకు కష్టాలు ఖాయం.

సమరోత్సాహంతో..

మరోవైపు న్యూజిలాండ్ కూడా ఫైనల్ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. డారిల్ మిఛెల్, మార్టిన్ గుప్టిల్, ఫిలిప్స్, నీషమ్, సాంట్నర్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అయితే స్టార్ ఆటగాడు డెవొన్ కాన్వే గాయంతో ఫైనల్‌కు దూరం కావడం కివీస్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇక కెప్టెన్ విలియమ్సన్ పేలవమైన ఫామ్ కూడా జట్టును కలవరానికి గురిచేస్తోంది. కానీ, సోధి, సౌథి, బౌల్ట్, సాంట్నర్ తదితరులతో కివీస్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News