Wednesday, January 22, 2025

సమరోత్సాహంతో భారత్

- Advertisement -
- Advertisement -

Today is the Under-19 World Cup Final

ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేడు అండర్19 ప్రపంచకప్ ఫైనల్ సమరం

అంటిగువా: అండర్19 ప్రపంచకప్ తుది పోరుకు భారత యువ జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో ఘన విజయం సాధించి భారత యువ జట్టు సమరోత్సాహంతో ఫైనల్ బరిలోకి దిగుతోంది. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇప్పటికే నాలుగు సార్లు అండర్19 ప్రపంచకప్ ట్రోఫీని గెలిచిన భారత్ మరో టైటిల్‌పై కన్నేసింది. ఇక ఇంగ్లండ్ సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో పోల్చితే భారత్ అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. సమష్టి పోరాటంతో భారత్ ముందుకు సాగుతోంది. జట్టులో కరోనా కలవరం సృష్టించినా టీమిండియా ఆటగాళ్లు మాత్రం అసాధారణ పోరాట పటిమతో ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఫైనల్లో కూడా గెలిచి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో భారత్‌కు ఇది 8వ ఫైనల్ సమరం కావడం విశేషం. ఇక కిందటిసారి భారత్ అనూహ్య ఓటమి పాలైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తుది సమరంలో టీమిండియా పరాజయం చవిచూసింది.

ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని భావిస్తోంది. ఇక భారత సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి యువ ఆటగాళ్లలో కొత్త స్ఫూర్తిని నింపాడు. ఫైనల్‌కు ముందు కోహ్లి యువ జట్టుకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. దీంతో యువ భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో ఫైనల్ బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న యుశ్ ధుల్ సేన ఐదో ట్రోఫీని ముద్దాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో అతి కష్టం మీద విజయం సాధించిన ఇంగ్లండ్ యువ జట్టుకు భారత్‌తో పోరు సవాల్ వంటిదేనని చెప్పాలి. అయితే ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఆ జట్టులో కూడా కొదవలేదు. దీంతో ఫైనల్ సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు ఇరు జట్ల మధ్య జరిగే తుది పోరుపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇరు దేశాలకు చెందిన అభిమానులు ఈ పోరు కోసం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌కు మెరికల్లాంటి యువ కెరటాలను ఘనత అండర్19 వరల్డ్‌కప్‌కే దక్కుతోంది. ఈ టోర్నీ ద్వారానే కోహ్లి, యువరాజ్, పృథ్వీషా, కైఫ్, హర్భజన్ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఈసారి కూడా వరల్డ్‌కప్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు బయటపడ్డారు. రషీద్, యశ్‌ధుల్ వంటి యువ ఆటగాళ్లు రానున్న రోజుల్లో టీమిండియాలో కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

సాయంత్రం 6.30 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News