ముంబై: కిందటి మ్యాచుల్లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ సోమవారం జరిగే పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకున్నాయి. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం సాధించగా, ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక సోమవారం జరిగే మ్యాచ్ రెండు జట్లకు కూడా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు కనిపిస్తున్నాయి. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్, మొయిన్ అలీ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై మొయిన్ ధాటిగా ఆడి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.
తొలి మ్యాచ్‌లో కూడా మొయిన్ మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. అతను ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇక డుప్లెసిస్ కూడా గాడిలో పడడం జట్టుకు ఊరటనిచ్చే అంశమే. అయితే యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లో అతన్ని ఆడిస్తారా లేదా అనేది సందేహమే. ఇక సురేశ్ రైనా, అంబటి రాయుడు, బ్రావో, జడేజా, శామ్ కరన్ తదితరులతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక దీపక్ చాహర్, శామ్ కరన్, శార్దూల్, జడేజా తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో దీపక్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయిన విషయం తెలిసిందే. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు రాజస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. అయితే బెన్‌స్టోక్స్ జట్టుకు దూరం కావడం రాజస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పాలి. ఈసారి జోస్ బట్లర్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బట్లర్ విజృంభిస్తే చెన్నై బౌలర్ల కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. ఇక కెప్టెన్ సంజు శాంసన్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. రియాన్ పరాగ్ రూపంలో మరో పదునైన అస్త్రం జట్టుకు అందుబాటులో ఉంది. ఇక కిందటి మ్యాచ్‌లో మోరిస్ మెరుపులు మెరిపించి జట్టును గెలిపించడం కూడా పెద్ద ఊరటనిచ్చే అంశమే. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ విజయమే లక్షంగా పెట్టుకుంది.