Friday, December 20, 2024

గుజరాత్‌కు పరీక్ష.. నేడు పంజాబ్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

మొహాలి: కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన గుజరాత్ టైటాన్స్‌కు గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరు కీలకంగా మారింది. కోల్‌కతా బ్యాటర్ రింకు సింగ్ అసాధారణ బ్యాటింగ్ వల్ల గుజరాత్ ఆ మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసింది. రింకు దెబ్బ నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం గుజరాత్‌కు అనుకున్నంత తేలికేం కాదనే చెప్పాలి. పంజాబ్ కూడా జోరుమీదుంది. అయితే కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓటమి పాలుకావడంతో కాస్త ఒత్తిడిలో ఉంది. కానీ సొంత గడ్డపై ఆడుతుండడం పంజాబ్‌కు సానుకూల అంశంగా చెప్పాలి. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఓపెనర్లే కీలకం..

ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌లు ప్రతి మ్యాచ్‌లోనూ శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా ఓపెనర్ల నుంచి గుజరాత్ ఇలాంటి శుభారంభం ఆశిస్తోంది. సాహా, గిల్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు. పంజాబ్‌పై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. సాయి సుదర్శన్, విజయ్ శంకర్‌లు కూడా జోరుమీదున్నారు. ఇలా టాపార్డర్ అంత ఫామ్‌లో ఉండడం గుజరాత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. మరోవైపు డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, కెప్టెన్ హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఉండనే ఉన్నారు. దీంతోపాటు జోసెఫ్, షమి, రషీద్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్‌లో గుజరాత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

తక్కువ అంచనా వేయలేం..

మరోవైపు పంజాబ్ కింగ్స్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు ఆ జట్టులో కొదవలేదు. కెప్టెన్ శిఖర్ ధావన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ చారిత్రక ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఒంటరి పోరాటం చేసిన ధావన్ ఆ మ్యాచ్‌లో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో పాటు వికెట్ కీపర్ జితేష్ శర్మ, మాథ్యూ షార్ట్, శామ్ కరన్, సికందర్ రజా తదితరులు ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేక పోతున్నారు. యువ సంచలనం షారుక్ ఖాన్ కూడా తేలిపోతున్నాడు. వీరి వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో వీరంతా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నారు. అదే జరిగితే పంజాబ్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక అర్ష్‌దీప్, హర్‌ప్రీత్ బ్రార్, శామ్ కరన్, రాహుల్ చాహర్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలుపు అవకాశాలను కూడా కొట్టి పారేయలేం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News