గుజరాత్‌తో రాజస్థాన్ ఢీ
నేడు క్వాలిఫయర్1 సమరం
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్15 నాకౌట్ పోరుకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే క్వాలిఫయర్-1లో రాజస్థాన్ రాయల్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఇందులో గెలిచే జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడినా జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్2లో ఓడిన జట్టు తలపడాల్సి ఉంటుంది. ఇక లీగ్ దశలో గుజరాత్ 10 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రాజస్థాన్ 9 మ్యాచుల్లో గెలిచి రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్ మైదానంలో క్వాలిఫయర్1 పోరు జరగనుంది.
ఇక లీగ్ దిశలో రాజస్థాన్‌పై గుజరాత్ జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో గుజరాత్ ఉంది. అయితే వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్‌ను ఓడించాలంటే గుజరాత్ తీవ్రంగా శ్రమించక తప్పదు. రెండు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. శుభ్‌మన్ లిగ్, సాహా, వేడ్, హార్దిక్, మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు గుజరాత్‌కు అందుబాటులో ఉన్నారు. ఈ సీజన్‌లో హార్దిక్ గుజరాత్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాట్‌తో బంతితో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. అతని అద్భుత సారథ్యం వల్లే గుజరాత్ లీగ్ దశలో టాపర్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేగాక షమి, హార్దిక్, రషీద్, ఫెర్గూసన్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు రాజస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, పడిక్కల్, అశ్విన్, హెట్‌మెయిర్, రియాన్ పరాగ్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. బట్లర్ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌కు కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బట్లర్ విజృంభిస్తే రాజస్థాన్‌కు భారీ స్కోరు కష్టమేమీ కాదు. ఇక కెప్టెన్ శాంసన్, పడిక్కల్, హెట్‌మెయిర్, పరాగ్ వంటి హార్డ్‌హిట్టర్లు ఉండనే ఉన్నారు. బౌల్ట్, అశ్విన్, ప్రసిద్ధ్, చాహల్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.