Friday, November 15, 2024

గెలిచి తీరాల్సిందే..!

- Advertisement -
- Advertisement -

Today match between India New Zealand

ఇరు జట్లకు కీలకం, నేడు కివీస్‌తో భారత్ ఢీ

దుబాయి: టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌కు టీమిండియా-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి రెండు జట్లకు నెలకొంది. ఇరు జట్లు కూడా తమ తమ మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు సెమీస్‌కు చేరడం చాలా కష్టమనే చెప్పాలి. పాకిస్థాన్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్2 నుంచి సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. దీంతో న్యూజిలాండ్‌భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ టోర్నమెంట్‌కే చాలా కీలకమని చెప్పాలి. ఇందులో ఏ జట్టు గెలిస్తే అదే సెమీస్‌కు చేరే పరిస్థితులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు మిగతా మూడు మ్యాచుల్లో గెలిచినా ఫలితం ఉండదు. ఎందుకంటే గ్రూప్2లో మూడు జట్ల మధ్యే సెమీస్ కోసం పోటీ నెలకొంది. ఇందులో పాకిస్థాన్ ఇప్పటికే సురక్షిత స్థితికి చేరుకుంది. ఇక మిగిలిన స్థానం కోసం భారత్‌కివీస్‌ల మధ్యే పోటీ నెలకొంది.

గెలుపే లక్ష్యంగా..

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో అవమానకర రీతిలో ఓటమి పాలైన భారత్ ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మ్యాచ్‌ను ముగించాలని భావిస్తోంది. కివీస్‌ను ఓడించడం ద్వారా సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు జట్టుకు కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్ ఆశించిన స్థాయిలో శుభారంభం అందించలేక పోయారు. ఈసారైనా వీరిద్దరూ మంచి ఆరంభాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్, రాహుల్‌లలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. అయితే నిలకడలేమి ఇద్దరికి సమస్యగా మారింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఇద్దరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. అప్పుడే టీమిండియా గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.

ఇక కిందటి మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఈసారి జట్టుకు కీలకంగా తయారయ్యాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయమనే చెప్పాలి. ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా ఉన్న కోహ్లిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరి విరాట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడుతాడో బరిలోకి దిగితేకానీ చెప్పలేం. ఇక కిందటి మ్యాచ్‌లో విఫలమైన యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా ఈసారి మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. సూర్య తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరును సాధించడం టీమిండియాకు కష్టం కాదు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా మెరుపులు మెరిపించాల్సి ఉంటుంది. కిందటి మ్యాచ్‌లో పంత్ బాగానే ఆడాడు. అయితే కీలక సమయంలో వికెట్‌ను పారేసుకున్నాడు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చివరి వరకు క్రీజులో నిలిచేలా చూడాలి. ఇక హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలు కూడా తమవంతు పాత్రను సమర్థంగా పోషించాలి. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా, హార్దిక్‌లు నిరాశ పరిచారు. ఈ మ్యాచ్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు.

బౌలర్లు కీలకం..

తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా బౌలర్లు కనీసం ఈసారైనా రాణిస్తారా లేదా అనేది సందేహమే. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కూడా టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టక పోవడం ఆందోళన కలిగించే అంశమే. ఈ మ్యాచ్‌లో శార్దూల్‌ను ఆడిస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ పాత జట్టునే కొనసాగించాలని భావిస్తే శార్దూల్ మరోసారి పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. ఇక హార్దిక్, భువనేశ్వర్, మహ్మద్ షమిలలో ఒకరిని తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ముగ్గురికి మరో అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలావుండగా షమి, భువనేశ్వర్‌లకు ఈ మ్యాచ్ ఓ సవాల్ వంటిదేనని చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో వీరిద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఈసారి మెరుగైన బౌలింగ్‌ను కనబరచాల్సి ఒత్తిడి వీరిపై నెలకొంది. ఇందులో వీరు ఎంత వరకు సఫలం అవుతారో వేచి చూడాల్సిందే. ఇక రవీంద్ర జడేజా, బుమ్రా, వరుణ్ చక్రవర్తిలు కూడా బౌలింగ్‌లో రాణించక తప్పదు. కాగా, హార్దిక్ కూడా ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశాలున్నాయి. ఇది టీమిండియాకు పెద్ద ఊరటనిచ్చే అంశమే. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమష్టిగా రాణిస్తేనే భారత్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలుంటాయి. లేకుంటే మరో ఓటమి తప్పదు.

తక్కువ అంచన వేయలేం..

మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకొంది. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. కివీస్ కూడా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో విలియమ్సన్ సేరకు కూడా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సర్వం ఒడ్డి పోరాడేందుకు కివీస్ సన్నద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అయితే పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడింది. పాక్‌పై కివీస్ 134 పరుగులు మాత్రమే చేసింది. ఈసారి మాత్రం భారీ స్కోరుపై కన్నేసింది. విలియమ్సన్, కాన్వే, మిఛెల్, ఫిలిప్స్, సిఫర్ట్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక బౌల్ట్, సౌథి, సాంట్నర్, సోధి, నిషమ్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. రెండు విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తున్న కివీస్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News