ముంబై: ఐపిఎల్ సీజన్16 ఆరంభ మ్యాచుల్లో వరుస ఓటములు చవిచూసిన మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఈ క్రమంలో శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై సమతూకంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా బాగానే ఆడుతున్నాడు. ముంబై విజయాల్లో ఇషాన్, రోహిత్ శర్మలు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక కామెరూన్ గ్రీన్ కూడా ఆల్‌రౌండ్ షోతో అలరిస్తున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో గ్రీన్ ఇటు బ్యాట్‌తో అటు బంతితో ఆకట్టుకున్నాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేయడమే కాకుండా బంతితోనూ సత్తా చాటాడు. గ్రీన్ జోరు మీదుండడం ముంబైకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నాడు. సన్‌రైజర్స్‌పై తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌ను ఆడాడు. 17 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 37 పరుగులు చేశాడు.
సూర్యకుమార్ ఈసారైనా?
ఇక ఈ సీజన్‌లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేలవమైన ఫామ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ సూర్యకుమార్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. కిందటి సీజన్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన సూర్యకుమార్ ఈసారి మాత్రం ఆ స్థాయి ఆటను కనబరచలేక పోతున్నాడు. అతని వైఫల్యం ముంబైని వెంటాడుతోంది. ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా సూర్య తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్త మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్యకుమార్ చెలరేగితే ముంబైకి ఎదురే ఉండదు. ఇక టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, నెహాల్ వధెరా తదితరులతో ముంబై బ్యాటింగ్ బలంగానే ఉంది. అంతేగాక గ్రీన్, అర్జున్, మెరెడిథ్, చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్ వంటి మ్యాచ్ విన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
పరీక్షలాంటిదే
మరోవైపు పంజాబ్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ పరీక్షలాంటిదేనని చెప్పాలి. బౌలింగ్‌లో బలంగానే ఉన్నా బ్యాటింగ్ వైఫల్యం పంజాబ్‌ను వెంటాడుతోంది. బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓటమికి పేలవమైన బ్యాటింగే ప్రధాన కారణం. మాథ్యూ షార్ట్, లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జితేష్ శర్మ, షారూక్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తదితరులు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. సమష్టిగా రాణించడంలో వీరు విఫలమవుతున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే పంజాబ్‌కు విజయం కష్టమేనని చెప్పక తప్పదు.